కావాల్సినంత డబ్బు, పెద్ద తుపాకీ, విదేశీ కార్లు.. ఈ నటుడి లైఫ్‌స్టైల్‌కు స్టార్ హీరోలు కూడా షాక్..
తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లికించబడింది. ఆయన నటన కోసం ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ఎలాంటి పాత్ర అయినా సరే అలవోకగా నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. అంతే కాదు హీరోలకు మించిన స్టైల్ ఆయనది.

విశ్వనట చక్రవర్తిగా సినిమా ఇండస్ట్రీలో చెరగని స్థాన్నాన్ని సొంతం చేసుకున్నారు ఎస్వీ రంగారావు. తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఎస్వీ రంగారావు, తన జీవితాంతం దర్బంతో, రాజసం తో జీవించారు. ఆయన వ్యక్తిత్వం, స్టైల్‌ను ఫాలోఅవ్వాలని చాలామంది ప్రయత్నించినా, అది సాధ్యం కాలేదు. రంగారావు షావుకారు సినిమా విడుదల కావడానికి ముందే ఒక చిత్రంలో నటించినప్పటికీ, అది విడుదలకాలేదు. అయితే, షావుకారు చిత్రంలో ఆయన అద్భుతమైన నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. సన్నగా, ఆరు అడుగుల పొడవుతో, అజానుబాహుడుగా ఉన్న రంగారావు తొలి నాళ్లలోనే ప్రేక్షకుల అభిమాన నటుడు అయ్యారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. పౌరాణిక సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన దశ తిరిగిపోయింది. అప్పట్లో అగ్రనటులైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుల కంటే కూడా అధికంగా పారితోషికం తీసుకున్న ఏకైక నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులకంటే కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తేనే తాను నటిస్తానని పట్టుబట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయట. ఈ డిమాండ్‌తోనే ఆయన సినిమాల్లో నటించేవారట. రంగారావు కేవలం గొప్ప నటుడిగానే కాకుండా, విశేషమైన అభిరుచులు ఉన్న వ్యక్తిగా కూడా పేరు పొందారు. ఆయనకు పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం. షూటింగ్ సెట్‌లో కాస్త విరామం దొరికితే చాలు, ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండేవారట. ముఖ్యంగా, వివేకానందుని రచనలంటే ఆయనకు అపారమైన ప్రేమ. వివేకానందకు సంబంధించిన పుస్తకాలను సేకరించి జాగ్రత్తగా భద్రపరిచేవారట. ఆయనకు ఉన్న మరో ఆసక్తికరమైన హాబీ ఫోటోగ్రఫీ. ఆయన దగ్గర రకరకాల కెమెరాలతో పాటు ఒక 16ఎమ్ఎమ్ కెమెరా కూడా ఉండేది.
దర్శకత్వంలోనూ ఎస్వీ రంగారావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన చదరంగం, బాంధవ్యాలు వంటి చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని, ప్రభుత్వ అవార్డులను కూడా పొందాయి. నటుడిగా ఎంత డిమాండ్ ఉన్నా, పారితోషికం విషయంలో మాత్రం ఉదారంగా ఉండేవారు రంగారావు. ఎక్కువ పారితోషికం తీసుకున్నా, దాని కోసం నిర్మాతలను ఎన్నడూ వేధించిన సందర్భాలు లేవని చెబుతారు. ఎస్వీ రంగారావుకి ఉన్న మరో విలక్షణమైన అభిరుచి వేట. ఇప్పుడంటే వేట నిషేధం కానీ, అప్పట్లో వేటకు అనుమతి ఉండేది. రంగారావు దగ్గర ఒక బరువైన తుపాకీ ఉండేది. దాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసేవారట. తన జీవితంలో ఒక నిజమైన రారాజులా వెలిగిన ఎస్వీ రంగారావుకు పద్మశ్రీ వంటి పురస్కారాలు లభించకపోయినా, నేటికీ ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
