Cristiano Ronaldo: ఫుట్‌బాల్ కింగ్ ఖాతాలో చేరిన మరో రికార్డ్.. ఆ లిస్టులో తొలి ఆటగాడిగా..
ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఎవర్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో విన్నింగ్ గోల్ చేశాడు. ఇది అతని క్లబ్ ఫుట్‌బాల్ కెరీర్‌లో 700వ గోల్ గా నిలిచింది.
ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో మరో భారీ రికార్డ్ నమోదు చేశాడు. క్లబ్ ఫుట్‌బాల్‌లో 700 గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఎవర్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేయడం ద్వారా అతను ఈ భారీ రికార్డు సృష్టించాడు. అతని గోల్ కారణంగా మాంచెస్టర్ యునైటెడ్ కూడా మ్యాచ్ గెలిచింది.
37 ఏళ్ల రొనాల్డో తన క్లబ్ ఫుట్‌బాల్ కెరీర్‌ను 20 సంవత్సరాల క్రితం స్పోర్టింగ్ లిస్బన్‌తో ప్రారంభించాడు. ఈ 20 సంవత్సరాలలో, అతను స్పోర్టింగ్‌లో అలాగే మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, జువెంటస్‌లకు ఆడాడు. అతను మొత్తం 944 మ్యాచ్‌లు ఆడి 700 గోల్స్ చేశాడు.
ఏ క్లబ్ తరపున ఎన్ని గోల్స్?
పోర్చుగల్ ఫుట్‌బాల్ క్లబ్ స్పోర్టింగ్ లిస్బన్ తరపున రొనాల్డో 5 గోల్స్ చేశాడు. ఒక సీజన్ తర్వాత, అతనిని మాంచెస్టర్ యునైటెడ్ తన జట్టులో చేర్చుకుంది. అతను మొదటి, రెండవ దశల్లో మాంచెస్టర్ యునైటెడ్ తరపున మొత్తం 144 గోల్స్ చేశాడు. అతను స్పానిష్ క్లబ్ రియల్ మాడ్రిడ్ కోసం ఆడుతూ 450 గోల్స్ చేశాడు. రియల్ మాడ్రిడ్ తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు కూడా అతనే. మాడ్రిడ్ తర్వాత, అతను ఇటాలియన్ ఫుట్‌బాల్ క్లబ్ జువెంటస్ తరపున 101 గోల్స్ చేశాడు.
View this post on Instagram
50 సార్లు హ్యాట్రిక్..
రొనాల్డో తన క్లబ్ ఫుట్‌బాల్ కెరీర్‌లో మొత్తం 50 హ్యాట్రిక్‌లు సాధించాడు. 700 గోల్స్‌లో 129 పెనాల్టీ స్పాట్ ద్వారా వచ్చాయి. ఛాంపియన్స్ లీగ్‌లో టాప్ స్కోరర్ కూడా. ఇక్కడ అతను 183 మ్యాచ్‌ల్లో 140 గోల్స్ చేశాడు. ఈ విషయంలో అతను లియోనెల్ మెస్సీ కంటే 13 గోల్స్ ముందు ఉన్నాడు.
2024 వరకు బరిలోనే..
అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా రొనాల్డో నిలిచాడు. పోర్చుగల్ తరపున 189 మ్యాచ్‌ల్లో 117 గోల్స్ చేశాడు. ఇటీవల, రొనాల్డో కూడా ప్రస్తుతానికి ఫుట్‌బాల్ నుంచి రిటైర్ అయ్యే ఆలోచన లేదని, యూరో 2024 వరకు తన దేశం కోసం ఆడాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.