Australian Open 2026 : ఇది కదా ఆట అంటే.. ఐదు గంటల పోరాటం.. జకోవిచ్‌కు షాకిచ్చి చరిత్ర సృష్టించిన స్పెయిన్ స్టార్
Australian Open 2026 : టెన్నిస్ ప్రపంచంలో సరికొత్త శకం మొదలైంది. స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ చరిత్రను తిరగరాశాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఫైనల్‌లో టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్‌ను మట్టికరిపించి, తన మొట్టమొదటి మెల్బోర్న్ టైటిల్‌ను ముద్దాడాడు.

Australian Open 2026 : టెన్నిస్ ప్రపంచంలో సరికొత్త శకం మొదలైంది. స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ చరిత్రను తిరగరాశాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఫైనల్‌లో టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్‌ను మట్టికరిపించి, తన మొట్టమొదటి మెల్బోర్న్ టైటిల్‌ను ముద్దాడాడు. ఈ గెలుపుతో కేవలం 22 ఏళ్ల వయసులోనే కెరీర్ గ్రాండ్ స్లామ్(అన్ని నాలుగు రకాల గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలవడం) పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా అల్కరాజ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఆదివారం మెల్బోర్న్ పార్క్ ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్, తన కెరీర్‌లో ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఎట్టకేలకు సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో నోవాక్ జకోవిచ్ వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొని, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి విజేతగా నిలిచాడు. ఈ విజయంతో ఓపెన్ ఎరాలో కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన ఆరో పురుష ఆటగాడిగా అల్కరాజ్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు 24 ఏళ్ల వయసులో సాధించిన రాఫెల్ నాదల్ పేరిట ఉండగా, ఇప్పుడు అల్కరాజ్ దాన్ని 22 ఏళ్లకే సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
నిజానికి ఈ టోర్నీకి ముందు వరకు అల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కనీసం సెమీఫైనల్ కూడా చేరలేదు. కానీ ఈసారి మాత్రం పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగాడు. సెమీఫైనల్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో ఏకంగా ఐదు గంటల 27 నిమిషాల పాటు పోరాడి గెలవడం అతని పట్టుదలకు నిదర్శనం. ఆ అలసట ఏమాత్రం లేకుండా ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించడం విశేషం. 21వ శతాబ్దంలో ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా అతను నిలిచాడు. ఫెదరర్ (2009), నాదల్ (2010), జకోవిచ్ (2016) తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సంపాదించిన ఆటగాడు అల్కరాజ్ మాత్రమే అనడంలో సందేహం లేదు.
అల్కరాజ్ ప్రస్థానం చూస్తుంటే మున్ముందు మరిన్ని రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అతను ఎనిమిది గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడి అందులో ఏడు టైటిళ్లు నెగ్గాడు. కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్లో ఓడిపోయాడు. రోలాండ్ గారోస్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను ఇప్పటికే రెండేసి సార్లు గెలిచిన అతను, ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 23 ఏళ్లు రాకముందే ఏడు మేజర్ టైటిళ్లు గెలిచిన జార్న్ బోర్గ్ రికార్డును కూడా అల్కరాజ్ అధిగమించాడు. తన చిన్ననాటి హీరో రాఫెల్ నాదల్ తర్వాత మెల్బోర్న్ టైటిల్ గెలిచిన రెండో స్పెయిన్ ఆటగాడిగా నిలిచి, తన దేశ కీర్తిని మరోసారి విశ్వవ్యాప్తం చేశాడు.
