AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఆర్‌సీబీలో 17 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఆడిన ఏ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని లక్కీ హ్యాండ్

IPL 2026 : ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును మట్టికరిపించి వరుసగా రెండోసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. అయితే ఈ భారీ టోర్నమెంట్‌లో ఆర్‌సీబీ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన మిరాకిల్ దాగి ఉంది. ఆ జట్టుకు చెందిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ ఈ సీజన్‌లో ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

IPL 2026 : ఆర్‌సీబీలో 17 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఆడిన ఏ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని లక్కీ హ్యాండ్
Jacob Duffy
Rakesh
|

Updated on: Jun 01, 2026 | 6:31 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును మట్టికరిపించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. అయితే ఈ భారీ టోర్నమెంట్‌లో ఆర్‌సీబీ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన మిరాకిల్ దాగి ఉంది. ఆ జట్టుకు చెందిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ ఈ సీజన్‌లో ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్‌లో అతను మైదానంలోకి దిగిన ఏ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆర్‌సీబీ ఓడిపోలేదు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఆర్‌సీబీ జట్టు తిరుగులేని పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. లీగ్ స్టేజ్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో 9 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గెలిచి, ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి కప్ కొట్టేసింది. అయితే ఈ సీజన్ మొత్తంలో ఆర్‌సీబీ 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కానీ జాకబ్ డఫీ ఆడిన మ్యాచ్‌ల్లో మాత్రం జట్టుకు అసలు ఓటమనేదే ఎదురుకాలేదు.

జాకబ్ డఫీకి ఇది మొట్టమొదటి ఐపీఎల్ సీజన్. తొలిసారి బరిలోకి దిగిన ఈ కివీస్ బౌలర్ ఆర్‌సీబీ తరఫున ఫైనల్‌తో కలిపి మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాడు. విచిత్రం ఏంటంటే, అతను ఆడిన ఆరుకు ఆరు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఐపీఎల్ కప్ గెలిచిన ఆర్‌సీబీ తొలి ప్లేయర్‌గా డఫీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి ఒక మ్యాజిక్ జరిగి సరిగ్గా 17 ఏళ్లు అవుతోంది.

ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఒకే సీజన్‌లో 100 శాతం మ్యాచ్‌లు గెలిచి ఛాంపియన్‌గా నిలిచిన నాల్గవ ఆటగాడిగా జాకబ్ డఫీ నిలిచాడు. అంతకుముందు 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పలాని అమరనాథ్ 6 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ గెలిచాడు. అలాగే అదే ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున ల్యూక్ పోమర్స్ బాచ్ 5 మ్యాచ్‌లు ఆడి ఓటమి ఎరుగకుండా నిలిచాడు. ఆ తర్వాత 2009లో డెక్కన్ చార్జర్స్ తరఫున హర్మీత్ సింగ్ వరుసగా 7 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించి కప్ కొట్టాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అంటే 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాకబ్ డఫీ ఆ రేంజ్ మ్యాజిక్‌ను రిపీట్ చేశాడు.

ఈ సీజన్‌లో జాకబ్ డఫీ కేవలం లక్కీ ప్లేయర్‌గానే కాకుండా బౌలింగ్‌తోనూ అద్భుతంగా రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తన మొదటి మ్యాచ్‌లోనే 22 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి ఆర్‌సీబీని గెలిపించాడు. ఆ తర్వాత చెన్నైపై 2 వికెట్లు, ముంబై ఇండియన్స్‌పై 1 వికెట్ సాధించాడు. కోల్‌కతా మ్యాచ్‌లో వికెట్లు పడకపోయినా.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ ఒక మ్యాచ్‌లో మళ్లీ 3 వికెట్లతో చెలరేగిపోయాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో వికెట్లు దక్కకపోయినప్పటికీ, ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌లలో మొత్తం 9 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

జాకబ్ డఫీకి అంతర్జాతీయ క్రికెట్‌లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఒకప్పుడు ఇతను టీ20 క్రికెట్‌లో ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా కూడా గుర్తింపు పొందాడు. తన ఓవరాల్ కెరీర్‌లో 48 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 62 వికెట్లు పడగొట్టాడు. అలాగే 19 వన్డే మ్యాచ్‌ల్లో 35 వికెట్లు, 4 టెస్ట్ మ్యాచ్‌ల్లో 25 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లోనే కాకుండా ఇంగ్లాండ్ వేదికగా జరిగే మెన్స్ 100 టోర్నీలో 8 వికెట్లు, టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో 10 వికెట్లు తీసి తానేంటో నిరూపించుకున్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us