FIFA 2026: నీ ఐడియా తగలెయ్యా..! ఫోన్‌లో మద్యం దాచి.. మ్యాచ్ మధ్యలో..
2026 ఫిఫా ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ సందర్భంగా అజ్టెకా స్టేడియంలో ఓ మెక్సికన్ అభిమాని మొబైల్ ఫోన్‌లా కనిపించే ప్రత్యేక కంటైనర్‌లో మద్యం దాచి సేవిస్తూ కెమెరాలకు చిక్కాడు. స్టేడియాల్లో మద్యం నిషేధం ఉన్నప్పటికీ భద్రతా తనిఖీలను ఎలా దాటాడనే అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది.

మెక్సికోలోని అజ్టెకా స్టేడియంలో జరిగిన 2026 ఫిఫా ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ సందర్భంగా ఓ మెక్సికన్ ఫుట్‌బాల్ అభిమాని చేసిన పని వైరల్‌గా మారింది. స్టేడియంల లోపల మద్యం సేవించడంపై ఫీఫా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ, ఓ అభిమాని మొబైల్ ఫోన్‌లా కనిపించే ప్రత్యేక కంటైనర్‌లో మద్యం దాచి తీసుకువచ్చి సేవిస్తూ కెమెరాలకు చిక్కాడు. మెక్సికో, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షిస్తున్న సమయంలో ఆ అభిమాని తన జేబులో నుంచి మొబైల్ ఫోన్‌ను తీసినట్లుగా కనిపించాడు. అయితే కొద్దిసేపటికే అది నిజానికి ఫోన్ కాదని, మద్యం నిల్వ చేసేందుకు రూపొందించిన ప్రత్యేక కంటైనర్ అని స్పష్టమైంది. ఆ కంటైనర్ నుంచి మద్యాన్ని గ్లాస్‌లో నింపుతున్న దృశ్యాలు స్టేడియంలోని ప్రేక్షకులు చిత్రీకరించగా, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో అజ్టెకా స్టేడియం భద్రతా ఏర్పాట్లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ, ఫోన్ రూపంలో ఉన్న కంటైనర్‌ను గుర్తించడంలో విఫలమవడం ఎలా జరిగిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో లోపాలున్నాయా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఫీఫా చాలా కాలంగా స్టేడియంలలో మద్యం వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ముఖ్యంగా ప్రపంచకప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో ప్రేక్షకుల భద్రత, క్రమశిక్షణ దృష్ట్యా ఈ నిబంధనలను మరింత కఠినంగా పాటిస్తున్నారు. అయితే ఈ సంఘటన ఆ నిబంధనల అమలులో ఉన్న బలహీనతలను బయటపెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
🤣 bro snuck in a tequila during the match between Mexico vs Xeno, he did it through is mobile device pic.twitter.com/f5LqNCNrOj
— Ade (@debornair99) June 13, 2026
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుండగా, కొందరు అభిమాని తెలివితేటలను ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం సరైంది కాదని విమర్శిస్తున్నారు. టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్‌ల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
