Yuvraj Singh: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి బ్యాట్ పట్టనున్న యువరాజ్ సింగ్
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ త్వరలో మరోసారి మైదానంలోకి దిగనున్నాడు. దేశం తరఫున బ్యాట్ పట్టి అభిమానులను అలరించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆటను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

క్రికెట్ చరిత్రలో గొప్ప లెఫ్ట్-హ్యాండ్ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్ త్వరలో ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) తొలి సీజన్‌లో ఇండియా మాస్టర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16, 2025 వరకు జరగనుంది. యువరాజ్ సింగ్ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా, 2007 ICC T20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన అదిరిపోయే ఇన్నింగ్స్, అలాగే 2011 వన్డే వరల్డ్ కప్లో భారత విజయానికి కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న క్షణాలు అభిమానులకు చిరస్థాయిగా నిలిచిపోతాయి
ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ కు ప్రాతినిధ్యం వహించడం పై యువరాజ్ సింగ్ స్పందించాడు. “సచిన్ తెండూల్కర్ సహా నా పాత సహచరులతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం ఒక గొప్ప అనుభూతి. ఈ టోర్నమెంట్ మన క్రికెట్ గోల్డెన్ యుగాన్ని గుర్తుచేస్తుంది. నన్ను ఆదరించిన క్రికెట్ అభిమానులకు మరిన్ని గొప్ప జ్ఞాపకాలు అందించేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అన్నాడు. దక్షిణాఫ్రికా మాస్టర్స్ జట్టుకు జె.పి. డుమిని, శ్రీలంక మాస్టర్స్ తరఫున ఉపుల్ తరంగ బరిలోకి దిగనున్నారు
సౌత్ ఆఫ్రికా ఆటగాడు జేపీ డుమిని విషయానికి వస్తే.. క్లాసీ స్ట్రోక్‌ప్లే, అవసరమైనప్పుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో జట్టుకు ఉపయోగపడిన ఈ ఆటగాడి ఖాతాలో 9,000కు పైగా అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి. దక్షిణాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన అతను ఈ టోర్నీలో పాల్గొనడంపై ఇలా స్పందించాడు. ‘దక్షిణాఫ్రికా మాస్టర్స్ తరపున IMLలో పాల్గొనడం నాకు గర్వకారణం. ప్రపంచ క్రికెట్ దిగ్గజాలతో కలిసి ఆడటం గొప్ప అనుభవంగా ఉంటుంది. అభిమానులకు ఉత్కంఠభరితమైన క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ’ అని చెప్పాడు.
శ్రీలంక తరపున 9,000+ అంతర్జాతీయ పరుగులు చేసిన ఓపెనర్ ఉపుల్ తరంగ, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో కొత్త బంతిని ఎదుర్కొని జట్టుకు మెరుగైన ప్రారంభాన్ని అందించేవాడు. ‘IMLలో శ్రీలంక మాస్టర్స్ తరపున ఆడే అవకాశం రావడం ఆనందంగా ఉంది. పాత మిత్రులు, ప్రత్యర్థులతో మళ్లీ మైదానంలో అడుగుపెడతాం. అభిమానులకు గొప్ప ఆటను అందిస్తాం’ అని తెలిపాడు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫిబ్రవరి 22, 2025 నుండి ప్రారంభమై, మార్చి 16, 2025 వరకు జరుగుతుంది. మ్యాచ్‌లు నవి ముంబై, రాజ్‌కోట్, రాయ్‌పూర్ మైదానాల్లో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లన్నీ కలర్స్ సినీ ప్లెక్స్ ఛానెల్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతాయి. ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..