IND vs ENG: కంకషన్ సబ్ వివాదం.. దూబే బదులు హర్షిత్ రాణా కరెక్టేనా? ఐసీసీ నిబంధనలు ఏమంటున్నాయంటే?
ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా పేసర్ హర్షిత్ రాణా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. తద్వారా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. తొలుత హర్షిత్ రాణాను భారత్ తుది జట్టులో లేడు. అయితే శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్‌గా వచ్చాడు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత కొత్త వివాదం తలెత్తింది. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ తీసుకున్న ఒక నిర్ణయం ఈ వివాదానికి కారణమైంది. పుణెలోని ఎంసీఏ మైదానం వేదికగా శుక్రవారం (జనవరి 31)న జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా హార్దిక్ పాండ్యా (53), శివమ్ దూబే (53) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇంతలో 20వ ఓవర్ 5వ బంతి శివమ్ దూబే హెల్మెట్‌కు తగిలింది. అయితే ఆఖరి బంతిని ఎదుర్కొని దూబే ఇన్నింగ్స్ ముగించాడు. అయితే టీమ్ ఇండియా ఫీల్డింగ్ సమయంలో శివమ్ దూబే కొన్ని ఓవర్లు మాత్రమే మైదానంలో కనిపించాడు. బంతి గట్టిగా తగలడంతో నొప్పితో అతను మధ్యలోనే మైదానాన్ని విడిచిపెట్టాడు. దూబే వెళ్లిపోవడంతో భారత జట్టు కంకషన్ సబ్ స్టిట్యూబ్ ఆప్షన్ ద్వారా ప్రత్యామ్నాయంగా మరో ప్లేయర్ ను బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. దీని ప్రకారం, మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్‌కు విజ్ఞప్తి చేసి, శివమ్ దూబే స్థానంలో హర్షిత్ రాణాను తీసుకున్నారు. అయితే మ్యాచ్ రిఫరీ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు వివాదానికి కారణమైంది.
ఐసీసీ నిబంధనలివే..
ఐసీసీ నిబంధనలు, కంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్రొటోకాల్ ప్రకారం ఒకరికి బదులు మరొకరిని ఆడేందుకు అనుమతించొచ్చు. అయితే, బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. లేదా బౌలర్ స్థానంలో బౌలర్.. లేదా ఆల్‌రౌండర్ స్థానంలో ఆల్‌రౌండర్‌కు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో శివమ్ దూబే ఇప్పటికే బ్యాటింగ్ చేసినందున, మ్యాచ్ రిఫరీ అతని తదుపరి పాత్రను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో దూబే బౌలర్‌గా సేవలు అందించాల్సి రావడంతో మ్యాచ్ రిఫరీ హర్షిత్ రాణాను బౌలర్‌గా అనుమతించారు.
అయితే హర్షిత్ రాణా ఎంపిక ఐసీసీ నిబంధనలకు విరుద్ధమన్న వాదనను ఇప్పుడు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, మాజీ ఆటగాళ్లు ముందుకు తెచ్చారు. ప్రధానంగా మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన శివమ్ దూబేకి బదులుగా స్పెషలిస్ట్ పేసర్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రాణాకు ఎలా అవకాశం కల్పించారనేది వారి ప్రశ్న. శివమ్ దూబే ఆల్ రౌండర్. అతని స్థానంలో కంకషన్ సబ్‌గా ఆల్‌రౌండర్‌ను రంగంలోకి దించడం సరైన ఎంపిక. అయితే మ్యాచ్ రిఫరీ ఆల్ రౌండర్‌కు బదులుగా స్పెషలిస్ట్ బౌలర్‌ను అనుమతించడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తప్పు పడుతున్నారు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ కూడా మ్యాచ్ రిఫరీ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రానాను మ్యాచ్ రిఫరీ ఎలా అనుమతించారో నాకు అర్థం కావడం లేదు. అలాంటి ఎంపికల విషయంలో మ్యాచ్ రిఫరీ స్పష్టంగా ఉండాలని కుక్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్ రిఫరీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మొదట విభేదించాడు. డగౌట్‌కి కూడా వెళ్లి చర్చించాడు.
అప్పీల్ కు నో ఛాన్స్!
కంకషన్ సబ్ స్టిట్యూట్ నిర్ణయంలో మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం. ఏదైనా జట్టు విజ్ఞప్తి మేరకే నిర్ణయం తీసుకోవాలి. దీనిపై ప్రత్యర్థి జట్టుకు అప్పీలు చేసేందుకూ ఎలాంటి హక్కు, అధికారం ఉండదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..