WTC Final 2023: ఇషాన్ కిషన్ లేదా కేఎస్ భరత్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఎవరికి అవకాశం.. తేల్చేసిన ఇద్దరు మాజీలు..
Ishan Kishan vs KS Bharat: ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Final 2023)లో ఏ వికెట్ కీపర్‌కు అవకాశం లభించాలి? దీనిపై టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

Ishan kishan Vs KS Bharat WTC Final 2023: ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Final 2023)లో ఏ వికెట్ కీపర్‌కు అవకాశం లభించాలి? దీనిపై టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్‌కి టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉందని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుతం అంతరి చూపు వీరిద్దిరిపైనే నిలిచింది.
ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వికెట్ కీపర్ పాత్ర కోసం టీమ్ మేనేజ్‌మెంట్‌కు కేఎస్ భారత్ స్పష్టమైన ఎంపిక అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం తర్వాత కోలుకుంటున్నాడు. అతని స్థానంలో లోకేష్ రాహుల్ అనుకున్నా.. అతను కూడా గాయపడడంతో కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇదిలా ఉండగా జూన్ 7 నుంచి ఓవల్‌లో ప్రారంభమయ్యే WTC ఫైనల్‌కు టీమిండియా ప్లేయింగ్ 11లో ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ లలో ఎవరిని ఎంచుకోవాలనే దానిపై టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ డైలమాలో ఉంది.
భరత్‌కే అవకాశం లభిస్తుంది: రవిశాస్త్రి
‘సంవత్సరం ప్రారంభంలో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భరత్ వికెట్ కీపింగ్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇషాన్ కంటే భారత్‌కు ప్రాధాన్యత లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. మరి ఏ వికెట్ కీపర్‌కి అవకాశం దక్కనుందో జూన్ 7నే చూడాలి. భరత్ ఆస్ట్రేలియాతో అన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కాబట్టి ఫైనల్ 11లో ఎంపికయ్యే మొదటి ఎంపిక అతనే అని నేను భావిస్తున్నాను’ అంటూ మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.




WTC ఫైనల్‌లో పిచ్ పరిస్థితులు కూడా కీలకమని శాస్త్రి సూచించాడు. ఆ తర్వాత ఎవరికి అవకాశం దక్కుతుందో నిర్ణయిస్తారని ఆయన తెలిపాడు. ఇది మరొక కఠినమైన నిర్ణయం, ఇద్దరు స్పిన్నర్లు ఆడుతుంటే, భరత్ ఆడాలని కోరుకుంటాను అంటూ ఆయన సెలవిచ్చాడు.
భరత్‌కే తొలి ప్రాధాన్యత..
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో భరత్ ఆశించిన ప్రదర్శన చేయలేదు. వికెట్ కీపర్‌గా భారత్ రాణించినప్పటికీ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లపై అతను 101 పరుగులు మాత్రమే చేయగలిగాడు. భరత్ నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అదే సమయంలో ఇషాన్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. అతను 48 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇషాన్ కిషన్‌కు ఆస్ట్రేలియాపై అవకాశం లభించలేదు. ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ గాయపడిన తర్వాత, అతను WTC భారత జట్టులో చేరాడు. గత ఏడాది చివర్లో చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
ఈ కీపర్‌నే ఎంచుకోవాలి: దినేష్ కార్తీక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ భరత్ అనుభవం WTC ఫైనల్‌కు అతనిని మొదటి ఎంపికగా చేస్తుందని తెలిపాడు. కార్తీక్ మాట్లాడుతూ- ఇషాన్ కిషన్ అరంగేట్రం చేయాల్సి ఉందని, WTCలో నేరుగా ఆడటం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..