AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కోచ్‌గా కాదు, అంతకుమించి.. పెద్ద బాధ్యతల్లోకి వీవీఎస్ లక్ష్మణ్‌..!

VVS Laxman: క్రికెటర్‌గా మైదానంలో తన క్లాసిక్ షాట్లతో అలరించిన వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్, ఇప్పుడు పరిపాలకుడిగా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. ఈ కీలక నిర్ణయంతో భారత క్రికెట్ రూపురేఖలు మరింత పటిష్టంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే బీసీసీఐ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కోచ్‌గా కాదు, అంతకుమించి.. పెద్ద బాధ్యతల్లోకి వీవీఎస్ లక్ష్మణ్‌..!
Vvs Laxman
Venkata Chari
|

Updated on: Aug 14, 2026 | 12:07 PM

Share

VVS Laxman, BCCI Director of Cricket: బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక సరికొత్త పదవిని సృష్టించి, ఆ గురుతర బాధ్యతను దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ భుజాలపై పెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇకపై టీమిండియా భవిష్యత్తుకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఆయన కనుసన్నల్లోనే జరగనున్నాయి. ఆ కీలక బాధ్యతల గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం.

బోర్డులో కొత్త శకం.. లక్ష్మణ్ చేతికి పగ్గాలు

టీమిండియా వ్యవహారాల్లో రాబోయే రోజుల్లో పెను మార్పులు జరగనున్నాయి. ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. కోచ్‌ను మార్చకుండానే మొత్తం క్రికెట్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఏకంగా ఒక కొత్త పదవినే తెరపైకి తెచ్చింది. బెంగళూరులో నూతనంగా నిర్మించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఒకప్పటి జాతీయ క్రికెట్ అకాడమీ) కు ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌ను ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ గా నియమించబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. కొన్నాళ్లుగా ఆయనకు టెస్ట్ జట్టు కోచ్ బాధ్యతలు ఇస్తారని వార్తలు వచ్చినా, బీసీసీఐ పెద్దలు మాత్రం అంతకంటే ఉన్నతమైన స్థానంలో ఆయన్ను కూర్చోబెట్టాలని గట్టిగా నిశ్చయించుకున్నారు.

ఎక్కువమంది చదివింది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ ఆఫ్ క్రికెట్.. ఈ పదవి వెనుక ఉన్న అసలు కథ

నిజానికి భారత క్రికెట్ బోర్డు చరిత్రలో ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ అనే శాశ్వత పదవి ఇంతవరకు లేదు. బోర్డులో ఏ నిర్ణయమైనా అధ్యక్షుడు, కార్యదర్శి తీసుకుంటారు. గతంలో డంకన్ ఫ్లెచర్ కోచ్‌గా ఉన్న సమయంలో రవిశాస్త్రి కొద్దిరోజుల పాటు తాత్కాలిక పర్యవేక్షకుడిగా పనిచేశారు. ఇప్పుడు ఆ పదవిని పూర్తిస్థాయి అధికారాలతో సృష్టించి లక్ష్మణ్ చేతికి అప్పగించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో 11 వేలకు పైగా పరుగులు సాధించిన అపార అనుభవంతో పాటు, 2026లో అండర్-19 జట్టుకు ప్రపంచకప్ అందించిన ఘనత ఆయన సొంతం. 2021లో ఎన్‌సీఏ బాధ్యతలు తీసుకున్న తర్వాత కుర్రాళ్లను సానబెడుతున్న తీరుకు మెచ్చి బోర్డు ఆయనకు ఈ భారీ బహుమతి ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

పురుషుల, మహిళల క్రికెట్ అంతా ఆయన కనుసన్నల్లోనే..

ఒకవేళ ఈ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి అధికారికంగా ఖరారైతే, దేశంలోని మొత్తం క్రికెట్ వ్యవహారాలు లక్ష్మణ్ చేతుల మీదుగానే నడుస్తాయి. పురుషుల జట్టుతో పాటు మహిళల క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించిన అన్ని నిర్ణయాల్లో ఆయనే తుది తీర్పు చెబుతారు. సీనియర్ జట్ల నుంచి జూనియర్ జట్ల దాకా అందరి ఆటతీరును పర్యవేక్షించే బాధ్యత ఆయనపైనే ఉంటుంది. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలతో కలిసి క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) లో పనిచేసినప్పుడు అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి లాంటి వారిని కోచ్‌లుగా ఎంపిక చేయడంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. ఎంపిక కమిటీతో పాటు కోచింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగే అత్యున్నత అధికారం ఆయనకు దక్కనుంది.

ఎక్కువమంది చదివింది: Team India: వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టెస్ట్‌ల్లో టీమిండియాకు విలన్ అతడేనా..?

అరుదైన జాబితాలో మన తెలుగు తేజం

సాధారణంగా భారత క్రికెట్ బోర్డులో కీలక పరిపాలనా పదవులు దక్కించుకున్న మాజీ క్రికెటర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఎవరైనా సలహాదారులుగా మాత్రమే పనిచేశారు. గతంలో సునీల్ గవాస్కర్, డయానా ఎడుల్జీ, సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ లాంటి దిగ్గజాలు మాత్రమే ఇలాంటి ఉన్నత స్థానాల్లో పనిచేశారు. ఇప్పుడు ఆ అరుదైన పరిపాలకుల జాబితాలో మన తెలుగు తేజం వీవీఎస్ లక్ష్మణ్ చేరడం విశేషం. ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు, ప్రతిభను గుర్తించడం, జాతీయ జట్టుకు అవసరమైన బెంచ్ బలాన్ని పెంచడం లాంటి దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయడంలో లక్ష్మణ్ మార్క్ కనిపించబోతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us