Team India: సెమీస్ ఎఫెక్ట్.. తెరపైకి టీమిండియా మాజీ బౌలర్.. టీ20ల్లో ద్రవిడ్ కంటే నెహ్రా బెస్ట్.?

ఆసియా కప్, ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ ఇలా.. ఐసీసీ టోర్నమెంట్స్‌లో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండట్లేదు.

Team India: సెమీస్ ఎఫెక్ట్.. తెరపైకి టీమిండియా మాజీ బౌలర్.. టీ20ల్లో ద్రవిడ్ కంటే నెహ్రా బెస్ట్.?
Ashish Nehra
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 25, 2022 | 1:26 PM

ఆసియా కప్, ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ ఇలా.. ఐసీసీ టోర్నమెంట్స్‌లో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తగా, ఇప్పుడు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌పై కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఇటీవల టీ20 ఫార్మాట్‌ను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి కోచింగ్ సిబ్బందిలో ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. అతడు ద్రవిడ్ కంటే టీ20ల్లో టీమిండియా బెస్ట్ హెడ్ కోచ్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. ఇంతకీ అతడెవరో కాదు ఆశిష్ నెహ్రా.

తాజాగా ఈ మాజీ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్‌లో తన కోచింగ్ స్కిల్స్‌ను నిరూపించుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఇతడి పేరు తెరపైకి వచ్చింది. నెహ్రా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన గుజరాత్ టైటాన్స్‌ తొలి సీజన్‌లోనే చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, టీ20లో ద్రవిడ్ కంటే నెహ్రా మెరుగైన హెడ్ కోచ్‌గా నిరూపించుకోగలడా? నెహ్రాను టీమ్ ఇండియాకు ఆదర్శవంతమైన కోచ్‌గా మార్చే ఆ 4 ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 మ్యాచ్‌ల్లో మంచి అనుభవం:

ఆశిష్ నెహ్రా టీ20 ఫార్మాట్‌ని బాగా అర్థం చేసుకోగలడని హర్భజన్ సింగ్ అభిప్రాయం. ఎందుకంటే.. నెహ్రాకు 88 ఐపీఎల్ మ్యాచ్‌లు, 27 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.

జట్టు కూర్పులో నిపుణుడు:

టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఆశిష్ నెహ్రా నైపుణ్యం అంతా ఇంతా కాదు. ఆటగాళ్లతో అతడెప్పుడూ స్నేహంగా మెలగడమే కాదు.. చాలామంది యువ ఆటగాళ్ళకు ఛాన్స్‌లు కల్పిస్తాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున నెహ్రా అదే చేశాడు. పెద్దగా పేరు లేని చాలామంది యువ ఆటగాళ్లకు ప్లేయింగ్ XIలో నెహ్రా చోటు కల్పించాడు. ఇందులో సాయి కిషోర్, సాహా, వేడ్, రాహుల్ టేవాటియా లాంటివారు ఉన్నారు. చివరకు ఈ ఆటగాళ్లే జట్టును చాంపియన్‌గా చేశారు.

గణాంకాలను నెహ్రా అస్సలు పట్టించుకోడు..

ఆశిష్ నెహ్రాలోని మరో విశేషమేమిటంటే.. స్టాటిస్టిక్స్, మ్యాచ్ అప్స్ వంటి వాటిపై శ్రద్ధ పెట్టడు. ఆటగాడు అద్భుత నైపుణ్యం కలిగిన వాడైతే ఎలాంటి పరిస్థితిలోనైనా, ప్రత్యర్థిపైనా మెరుగ్గా రాణించగలడని అతడు నమ్ముతాడు. ఆ ప్రకారం ఆటగాళ్ళను ఎంపిక చేస్తాడు.

కెప్టెన్‌పై నమ్మకం, ఫైన్ ట్యూనింగ్

2024 T20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా ఉండగలడని చాలామంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పాండ్యా న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో కూడా కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. ఒకవేళ టీ20లకు పాండ్యా కెప్టెన్‌ అయితే.. కోచ్‌గా నెహ్రా ఉంటే ఫైన్ ట్యూనింగ్ పొందడం ఖాయం. గుజరాత్ టైటాన్స్‌లో వీరిద్దరి జోడీ.. ఆ యాజమాన్యానికి తొలి ఐపీఎల్ టైటిల్‌ అందించడంలో సహాయపడ్డారు.