Andhra: సెలవంటే ఎరుగని ఉపాధ్యాయుడు… అభినందించిన డిఈవో

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నవారికి బోలెడన్ని లీవ్స్ ఉంటాయి. సాధారణ సెలవులుతో పాటు ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి. అవసరాన్ని బట్టి వాటిని వినియోగించుకోవచ్చు. కానీ ఈయన మాత్రం ఏడాదిలో ఒక్క సెలవు కూడా వినియోగించుకోకుండా.. అందరికీ ఆదర్శంగా నిలిచాడు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Andhra: సెలవంటే ఎరుగని ఉపాధ్యాయుడు... అభినందించిన డిఈవో
Pasupuleti Sridhar
Follow us
T Nagaraju

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 08, 2025 | 10:49 AM

ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారాలతో పాటు వివిధ సెలవు దినాలను ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తుంది. అటువంటి సెలవు దినాల్లో కార్యాలయాలకు, బడులకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ఈ సెలవు దినాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు సాధారణ సెలవులు, మెడికల్ లీవ్స్ పెట్టుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇంకొన్ని ఆప్షనల్ హాలిడేస్ కూడా ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు..  ఏదో ఒక సమయంలో అందరూ ఈ సెలవులను ఉపయోగించుకుంటుంటారు.

అయితే గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం లేమల్లేపాడు ప్రాధమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న పసుపులేటి శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఏడాది పాటు ఒక రోజు కూడా సెలవు తీసుకోకుండా పాఠశాలకు హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న శ్రీధర్ 2024 సంవత్సరంలో ఒక్క సెలవు కూడా పెట్టకుండా క్రమం తప్పకుండా బడికి హాజరయ్యారు. అంతే కాకుండా గత 28 ఏళ్లలో ఆర్జిత సెలవులు కానీ, అర్ధ జీతం సెలవులు కాని పెట్టి ఎరుగుడు.. టీచర్ వృత్తి అత్యంత పవిత్రంగా భావిస్తూ విద్యార్ధుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న శ్రీధర్ సెలవు పెట్టని కారణంగా పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ విషయం గుంటూరు జిల్లా డిఈవో రేణుక గుర్తించి ఆ ఉపాధ్యాయుడుని ప్రత్యేకంగా అభినందించారు.

ప్రధానోపాధ్యాయుడే క్రమం తప్పకుండా హాజరయి ఆదర్శంగా నిలవడంతో మిగిలిన ఉపాధ్యాయులు కూడా అతి తక్కువ సెలవులు పెట్టి పాఠశాలకు హాజరవుతున్నారు. శ్రీధర్ పాఠశాలకు హాజరై పాఠాలు బోధించడమే కాకుండా పాఠశాల అభివృద్ధికి తన వంతు సాయం చేస్తున్నారు. స్వచ్చందంగా విరాళాలు ఇచ్చేలా స్థానికులను ప్రోత్సహించి వారిని డబ్బుతో పాఠశాలను అభివృద్ధి చేశారు. అంతటి మంచి ఉపాధ్యాయుడు తమ ఊరి పాఠశాలలో ఉండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..