MS Dhoni: కుటుంబంతో కలిసి ఇంగ్లండ్ చేరుకున్న ఎంఎస్ ధోని.. ఆ ‘స్పెషల్ డే’ని సెలబ్రేట్ చేసుకోవడానికేనా?
India Vs England: ధోనీతో పాటు అతని భార్య సాక్షి కూడా లండన్ చేరుకున్నారు. ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్‌లోని చివరి మ్యాచ్ జరుగుతున్న సందర్భంలోనే అక్కడి చేరుకోవడం.. కాస్త ఆసక్తిని కలిగిస్తోంది.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(Dhoni) ఇంగ్లండ్ చేరుకున్నాడు. ఈ మేరకు ధోని లండన్ చేరుకున్న ఫొటోలను భార్య సాక్షి ధోనీ నెట్టింట్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్(ENG vs IND) పర్యటనలోనే ఉన్న విషయం తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌లో రిషెడ్యూల్ చేసిన ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇదే సమయంలో ధోని అక్కడి చేరుకోవడం కాస్త ఆసక్తిగా మారింది. ధోనీతో పాటు అతని భార్య సాక్షి కూడా లండన్ చేరుకున్నారు. కాగా, ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ అభిమానుల హృదయాల్లో ధోనీకి ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. ధోని అప్‌డేట్స్ అన్ని సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో తన స్టోరీలో ధోనీ చిత్రాన్ని పంచుకుంది. ఈ ఫొటోలో ధోని తనదైన శైలిలో నవ్వుతూ కనిపించాడు.
భార్య సాక్షి షేర్ చేసిన ఫోటోలో ధోనీ నీలిరంగు చొక్కా, నలుపు జీన్స్‌తోపాటు ముదురు నీలం రంగు జాకెట్ ధరించి ఉన్నాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో ల్యాండ్ అయిన తర్వాత వైరల్ కావడానికి పెద్దగా సమయం పట్టలేదు. ధోని క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఉండొచ్చు.. కానీ, ఇప్పటికీ ధోనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు.
ఎంఎస్ ధోని లండన్ ఎందుకు చేరుకున్నాడు?
అయితే ఎంఎస్ ధోని లండన్ ఎందుకు వెళ్లాడు అనేది మాత్రం ప్రస్తుతానికి తేలలేదు. సమాచారం మేరకు ధోని తన రాబోయే 41వ పుట్టినరోజు వేడుకలకు అక్కడి వెళ్లి ఉండొచ్చని అంటున్నారు. జులై 7న ధోనీ 41వ పుట్టినరోజు రానుంది. అయితే, ధోని తన మోకాలి గాయం చికిత్స కోసం ఇంగ్లాండ్ వచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
మారుమూల గ్రామంలో రూ.40తో చికిత్స..
ఇటీవల ధోని గురించి ఒక వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది. దాని ప్రకారం ధోనీ తన మోకాలి గాయానికి రాంచీ సమీపంలోని ఒక వైద్యుడి వద్ద చికిత్స చేయించుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. నెలలో 4 సార్లు ఆ వైద్యుడిని సందర్శించేవాడంట. అయితే, ఆ వైద్యుడి ఫీజు కేవలం రూ. 40లు మాత్రమే కావడంతో ఈ న్యూస్ నెట్టింట్లో తెగ సందడి చేసింది. ధోనీకి చికిత్స చేస్తున్న వైద్యుడి పేరు బంధన్ సింగ్ ఖర్వార్. అతను చెట్టు కింద కూర్చుని రోగులకు చికిత్స చేసేవాడు.
IPL 2022 నుంచి CSK నిష్క్రమించినప్పటి నుంచి ధోని రాంచీలోనే ఉంటూ, స్నేహితులు, బంధువులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రాంచీకి చెందిన తన సన్నిహితులతో కలిసి దిగిన ఫొటోలు కూడా నెట్టింట్లో సందడి చేశాయి.