IPL: ఈ విధ్వంసానికి కారణం ఐపీఎల్.. నా ఆటనే మార్చేసింది.. ఆసీస్ ఆల్ రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Marcus Stoinis: ఈ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన స్టోయినీస్.. అందుకు గల కారణం కూడా చెప్పడంతో.. ఐపీఎల్ పై తీవ్ర చర్చకు దారి తీశాడు.
శ్రీలంకపై 18 బంతుల్లో అజేయంగా 59 పరుగులతో విధ్వంసం సృష్టించి, ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్‌లో తొలి విజయం సాధించడంలో ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కీలక పాత్ర పోషించాడు. అయితే, లంక స్పిన్నర్లపై ముఖ్యంగా వనిందు హసరంగా, మహిష్ తీక్షలపై దూకుడు చూపించి, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో గెలిపించాడు. అయితే, ఈ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన స్టోయినీస్.. అందుకు గల కారణం కూడా చెప్పడంతో.. ఐపీఎల్ పై తీవ్ర చర్చకు దారి తీశాడు. తన దూకుడికి కారణం ఐపీఎల్ అంటూ క్రెడిట్ ఇచ్చేశాడు. కేవలం స్పిన్నర్లపై వైఖరిలో మార్పునకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటూ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం మార్కస్ స్టోయినిస్ మాట్లాడుతూ, “అవును, ఐపీఎల్ ఖచ్చితంగా నా క్రికెట్‌ను మార్చేసింది. నేను మెరుగైన క్రికెటర్‌గా మారడానికి సహాయపడింది” అంటూ చెప్పుకొచ్చాడు. “నేను గత కొన్నేళ్లుగా IPLలో ఆడుతున్నాను. అక్కడ నేను స్పిన్ ఆడటం గురించి వివిధ పద్ధతులు, ఆలోచనల గురించి తెలుసుకున్నాను. ఇది ఖచ్చితంగా నేను మంచి క్రికెటర్‌గా మారడానికి సహాయపడింది” అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
స్టోయినిస్ తన ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తరపున T20 అంతర్జాతీయ క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును కూడా సృష్టించాడు. తాను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు కాస్త నెర్వస్‌గా ఉన్నట్లు అంగీకరించాడు. “నిజం చెప్పాలంటే, నేను నిజంగా భయపడ్డాను. నా ఉద్దేశ్యం క్రీజులోకి వెళ్లి నా సహచరుల ఉత్సాహాన్ని నింపడం ద్వారా ప్రభావం చూపాలని కోరుకున్నాను” అంటూ తెలిపాడు.
మార్కస్ స్టోయినిస్ 18 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేయడంతో, టీ20 ప్రపంచ కప్‌లోని సూపర్ 12 దశలో గ్రూప్ I మ్యాచ్‌లో శ్రీలంకను 7 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా టోర్నమెంట్‌లో బలమైన పునరాగమనం చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ స్టొయినిస్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాది మ్యాచ్‌ను పూర్తిగా ఆస్ట్రేలియా వైపు మళ్లించాడు. టీ20లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 38 పరుగులతో చరిత్ అస్లంక దూకుడు ఇన్నింగ్స్‌తో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఆరోన్ ఫించ్ తన 42-బంతుల ఇన్నింగ్స్‌లో సౌకర్యంగా కనిపించలేదు. అయితే, స్టోయినిస్ క్రీజులో అడుగుపెట్టిన వెంటనే వేగంగా షాట్లు ఆడాడు. కేవలం 17 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఇది యువరాజ్ సింగ్ తర్వాత టీ20 ప్రపంచ కప్‌లో రెండవ వేగవంతమైన అర్ధ సెంచరీగా నిలిచింది. స్టోయినిస్, ఫించ్‌లు 25 బంతుల్లో 69 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆస్ట్రేలియా తరపున గ్లెన్ మాక్స్‌వెల్ కూడా 12 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. శ్రీలంకకు చెందిన అబుజా స్పిన్నర్ వనిందు హసరంగా మూడు ఓవర్లలో 53 పరుగులు ఇచ్చాడు. మహిష్ తీక్షణ మూడు ఓవర్లలో ఒక వికెట్ తో 23 పరుగులు ఇచ్చాడు.