Shubman Gill : శుభమన్ గిల్ దూకుడు.. రెండు మ్యాచ్‌లలోనే 585 పరుగులు.. 95 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేనా?
భారత కెప్టెన్ శుభమన్ గిల్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. రెండు మ్యాచ్‌లలోనే 585 పరుగులు సాధించి, డాన్ బ్రాడ్‌మన్ 95 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు.

Shubman Gill : భారత్, ఇంగ్లాండ్ మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా గిల్ నియామకం అయ్యారు. కెప్టెన్ అయిన తర్వాత గిల్ బ్యాట్ ఇంగ్లాండులో మోత మోగిస్తోంది. అతని బ్యాట్ నుంచి పరుగులు వరదలా పారుతున్నాయి. లీడ్స్ టెస్ట్ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో కూడా గిల్ సెంచరీ సాధించాడు. ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. గిల్ ఇలాగే మరో రెండు మ్యాచులు ఆడితే 95ఏళ్ల నాటి రికార్డు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పుడు రెండో మ్యాచ్ మాత్రమే జరుగుతోంది. ఇంకా మూడు మ్యాచులు మిగిలే ఉన్నాయి. ఇప్పటివరకు గిల్ ఈ సిరీస్‌లో 500కి పైగా పరుగులు చేశాడు. ఏదైనా టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రపంచ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. ఈ రికార్డు 95 సంవత్సరాల పాతది.
ఈ ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ 1930లో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై 974 పరుగులు సాధించాడు. ఆ సిరీస్‌లో డాన్ బ్రాడ్‌మన్ ఏడు ఇన్నింగ్స్‌లు ఆడి నాలుగు సెంచరీలు కొట్టాడు. శుభమాన్ గిల్ మాత్రం రెండు మ్యాచ్‌లలోనే దాదాపు 600 పరుగులు చేశాడు. అతని ఇదే దూకుడు కొనసాగితే డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత కెప్టెన్ శుభమన్ గిల్ లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ కేవలం 8 పరుగులు చేసి అవుటయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడి 269 పరుగులు చేశాడు. దీనితో పాటు రెండో ఇన్నింగ్స్‌లో కూడా శుభమన్ గిల్ రాణించి 161 పరుగులు సాధించాడు. ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌లలో గిల్ మొత్తం 585 పరుగులు చేశాడు. గిల్ బ్యాట్ ఇంగ్లాండ్‌లో ఇదే విధంగా కొనసాగితే భారత కెప్టెన్ డాన్ బ్రాడ్‌మన్ 95 సంవత్సరాల పాత రికార్డును బద్దలు కొట్టడం అంత కష్టమేమీ కాదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..