Shane Warne: నాన్నకు ప్రేమతో.. తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన షేన్ వార్న్ పిల్లలు..
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ (Shane Warne) హఠాన్మరణం క్రికెట్ అభిమానులతో సహా క్రీడా ప్రపంచాన్ని మొత్తం శోకసంద్రంలో ముంచేసింది.
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ (Shane Warne) హఠాన్మరణం క్రికెట్ అభిమానులతో సహా క్రీడా ప్రపంచాన్ని మొత్తం శోకసంద్రంలో ముంచేసింది. గత శుక్రవారం థాయ్‌లాండ్‌లోని కోయ్ సమూహ్ ప్రాంతంలోని తన విల్లాలో అచేతన స్థితిలో పడి ఉన్న వార్న్‌ను అతని స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వార్న్ గుండెపోటుతో మరణించాడని వైద్యులు తెలిపారు. తాజాగా వార్న్‌ది సహజ మరణమేనని థాయ్ పోలీసులు కూడా స్పష్టం చేశారు. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎన్నో సేవలందించిన వార్న్ మృతిపై సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా స్పిన్ దిగ్గజం పిల్లలతో పాటు తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. నాన్నను మిస్ అవుతున్నామంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్లు షేర్ చేశారు. ‘మా నాన్నే నాకు బెస్ట్ ఫ్రెండ్. లవ్ యూ నాన్న. నా హృదయంలో నువ్వు మిగిల్చి వెళ్లిన శూన్యతను ఏదీ పూరించలేదని భావిస్తున్నాను. పోకర్ టేబుల్ పక్కన కూర్చొని ఉండటం, గోల్ఫ్ కోర్స్‌లో వాకింగ్, పిజ్జా తినడం.. ఇలా ఏదీ అప్పటిలా ఉండదు. నేను నిత్యం సంతోషంగా ఉండాలని ఎప్పుడూ నువ్వు కోరుకుంటావని నాకు తెలుసు. అందుకే నువ్వు నా పక్కన లేకపోయినా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తా’ అని ఎమోషనల్ అయ్యాడు షేన్‌వార్న్ కుమారుడు జాక్‌సన్
డాడీ.. వియ్ మిస్ యూ! ‘డాడీ.. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నిజంగా నువ్వు ఉత్తమ తండ్రివి. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. జీవితం ఎంతో క్రూరమైంది.. నా తండ్రిని చాలా త్వరగా ఈ లోకం నుంచి తీసుకెళ్లింది. మీతో నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను’ అని ఎమోషనల్ నోట్‌లో రాసుకొచ్చింది పెద్ద కుమార్తె బ్రూక్. ఇక చిన్న కుమార్తె సమర్ ‘మిమ్మల్ని నాన్న అని పిలిచేందుకు ఎప్పుడూ గర్వ పడుతుంటాను. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా డాడీ. నేను నిన్ను గట్టిగా హత్తుకుని ఆనందించిన క్షణాలే చివరివి అవుతాయని అసలు ఊహించలేదు. మీతో గడపడానికి నాకు ఎక్కువ హాలీడేస్ కావాలి. మీ నవ్వుతో మా గదినంతా వెలుగుమయం చేస్తాం. మీరు పక్కన ఉంటే మేమంతా ఎంతో సురక్షితంగా ఉంటామనే నమ్మకం. మీరు చనిపోలేదు నాన్న.. ఇక్కడ నుంచి మరో ప్రదేశానికి వెళ్లారు.. అది మా హృదయంలోకి’ అంటూ భావోద్వేగానికి గురైంది. ఇక తమ కుమారుడి లేనిలోటును వర్ణించడానికి అసలు మాటలు రావడం లేదని షేన్‌వార్న్ తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా వార్న్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. వార్న్ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లోనే ఈ కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.