Sachin vs Kohli : సచిన్ vs కోహ్లీ.. ఎవరు గొప్ప? సౌరవ్ గంగూలీ సంచలన తీర్పు
Sachin vs Kohli : సచిన్ టెండూల్కర్‌తో కలిసి సుమారు 250 వన్డేల్లో ఓపెనింగ్ చేసిన జ్ఞాపకాలను గంగూలీ పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ పక్కన బ్యాటింగ్ చేయడం వల్ల తనపై ఉన్న ఒత్తిడిని ఆయన బయటపెట్టారు. టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన WITT సమ్మిట్‌లో గంగూలీ పాల్గొన్నారు.

Sachin vs Kohli : భారత క్రికెట్‌లో ఎప్పటికీ ముగియని చర్చ ఏదైనా ఉందంటే అది సచిన్ టెండూల్కర్ vs విరాట్ కోహ్లీ మాత్రమే. ఒకరు క్రికెట్ దేవుడిగా కొలవబడే దిగ్గజం అయితే, మరొకరు రికార్డులను వేటాడే రన్ మెషిన్. వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు టీమిండియా మాజీ కెప్టెన్, దాదా సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన WITT సమ్మిట్‌లో పాల్గొన్న గంగూలీ, ఈ ఇద్దరు లెజెండ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు గంగూలీ చాలా బ్యాలెన్సుడ్‌గా సమాధానం ఇచ్చారు. “వీరిద్దరూ చాలా గొప్ప ఆటగాళ్లు. వీరిద్దరూ భారతీయులు కావడం నాకు అత్యంత సంతోషాన్నిచ్చే విషయం. భారత్ తరపున వీరు ఎన్ని మ్యాచ్‌లు గెలిపించారో మనం ఊహించలేం. మైదానంలోకి దిగినప్పుడే తెలుస్తుంది ఇన్ని పరుగులు, ఇన్ని సెంచరీలు చేయడం ఎంత కష్టమో” అని గంగూలీ వివరించారు. ఈ ఇద్దరి మధ్య పోలిక పెట్టడం సరికాదని, ప్రతి తరం తమదైన ముద్ర వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సచిన్‌తో ఓపెనింగ్.. ఆ ఒత్తిడి వేరు
సచిన్ టెండూల్కర్‌తో కలిసి సుమారు 250 వన్డేల్లో ఓపెనింగ్ చేసిన జ్ఞాపకాలను గంగూలీ పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ పక్కన బ్యాటింగ్ చేయడం వల్ల తనపై ఉన్న ఒత్తిడిని ఆయన బయటపెట్టారు. “సచిన్ పక్కన ఆడుతున్నప్పుడు నా ఆట ఎప్పుడూ పడిపోకూడదని అనుకునేవాడిని. ఒకవైపు ఇంత గొప్ప ఆటగాడు ఉంటే, మరోవైపు ఒక యావరేజ్ ప్లేయర్ ఉన్నాడని జనం అనుకోకూడదు. నా ఫామ్ గురించి మా ఆవిడ అడిగినా.. నేను మాత్రం సచిన్ స్థాయికి తగ్గట్టు ఆడాలనే తాపత్రయపడేవాడిని” అని గంగూలీ గుర్తు చేసుకున్నారు.
ఒకరిని చూసి మరొకరు.. పెరిగిన స్థాయి
జీవితంలో మనకంటే బలమైన, గొప్ప వారితో కలిసి పనిచేసినప్పుడు మన స్థాయి కూడా పెరుగుతుందని గంగూలీ చెప్పుకొచ్చారు. సచిన్ వంటి దిగ్గజంతో కలిసి ఆడటం వల్ల తన ఆట కూడా మెరుగుపడిందని ఆయన అంగీకరించారు. సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ ఆయన రికార్డులను వేగంగా చేరుకుంటున్నాడు. ఇప్పటికే 2026 నాటికి కోహ్లీ టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, వన్డేల్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. సంఖ్యల పరంగా ఎవరు ముందున్నా, భారత క్రికెట్‌కు వారిద్దరూ అందించిన సేవలు వెలకట్టలేనివని గంగూలీ స్పష్టం చేశారు.
ముగియని చర్చ.. నిలిచే రికార్డులు
సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడి ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. ఆయన తర్వాత ఆ స్థాయి నిలకడను ప్రదర్శించింది కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లీ, సచిన్ రిటైర్మెంట్ (2013) వరకు ఆయనతో కలిసి ఆడాడు. సచిన్ వెళ్లిన తర్వాత టీమ్ ఇండియా బ్యాటింగ్ భారాన్ని తన భుజాన వేసుకుని రన్ మెషిన్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ఐపీఎల్, వన్డేల్లో కోహ్లీ మేనియా కొనసాగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరు నంబర్ 1 అనే చర్చ అభిమానుల మధ్య సాగుతూనే ఉన్నా, గంగూలీ మాత్రం ఇద్దరినీ సమానంగా గౌరవించాలని సూచించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
