Cricket Records: 39 మ్యాచులు, 12 సెంచరీలు, 2541 పరుగులు.. 25 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు
Cricket Records: 1998లో సచిన్ టెండూల్కర్ 39 మ్యాచ్‌ల్లో 42 ఇన్నింగ్స్‌లు ఆడి 2,541 పరుగులతో ఏకంగా 12 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. 25 ఏళ్లకు పైగా గడిచినా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీల రికార్డు ఇప్పటికీ సచిన్ పేరిటే ఉంది.

Cricket Records: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో స్థిరంగా పరుగులు సాధిస్తూ సెంచరీల మోత మోగించడం ఏ బ్యాటర్‌కైనా ఒక కల. భారత క్రికెట్‌లో ఎంతో మంది దిగ్గజాలు దశాబ్దాల కాలంగా తమ బ్యాటింగుతో అదరగొట్టినప్పటికీ, ఒకే ఏడాదిలో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు మాత్రం ఇప్పటికీ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిటే ఇప్పటికీ భద్రంగా ఉంది. క్రికెట్ చరిత్రలో 1998వ సంవత్సరం సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో స్వర్ణయుగంగా నిలిచిపోతుంది. ఆ ఒక్క ఏడాదే సచిన్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ఏకంగా 12 అంతర్జాతీయ శతకాలు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ సంవత్సరంలో మొత్తం 39 మ్యాచ్‌లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 42 ఇన్నింగ్స్‌లలో 68.67 అద్భుతమైన సగటుతో 2,541 పరుగులు సాధించాడు. పాతికేళ్లు గడిచినా ఏ భారతీయ బ్యాటర్ కూడా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 12 సెంచరీల మార్కును అందుకోలేకపోవడం సచిన్ సాధించిన రికార్డు గొప్పతనానికి అద్దం పడుతోంది.
రెండుసార్లు సచిన్ రికార్డుకు చేరువైన కోహ్లీ
సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ భారీ రికార్డును బద్దలు కొట్టడానికి రన్‌మిషన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా శ్రమించాడు. విరాట్ కోహ్లీ ఒకసారి కాదు ఏకంగా రెండు వరుస క్యాలెండర్ ఇయర్స్ లో 11 చొప్పున శతకాలు బాది సచిన్ రికార్డుకు అతి సమీపంలోకి వచ్చాడు. 2017లో 46 మ్యాచుల్లో 47 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 2,735 పరుగులు చేసి 11 సెంచరీలు నమోదు చేశాడు. మరుసటి ఏడాదే 2018లో కూడా అదే జోరు కొనసాగిస్తూ 37 మ్యాచుల్లో 2,735 పరుగులు సాధించి మరో 11 శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు వేర్వేరు క్యాలెండర్ ఇయర్లలో 11 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక భారతీయ బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు.
1999లో ద్రావిడ్, 2019లో రోహిత్ శర్మ 10 సెంచరీలు
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో సెంచరీల సంఖ్యను రెండంకెల స్థాయికి తీసుకెళ్లిన జాబితాలో ది వాల్ రాహుల్ ద్రావిడ్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఉన్నారు. 1999వ సంవత్సరంలో అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్ ద్రావిడ్ 53 మ్యాచుల్లో 62 ఇన్నింగ్స్‌లు ఆడి 2,626 పరుగులతో పాటు 10 సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మకు 2019వ సంవత్సరం గోల్డెన్ ఇయర్‌గా మారింది. ఆ ఏడాది టెస్టుల్లో ఓపెనర్‌గా అవతారమెత్తిన హిట్ మ్యాన్, వన్డేల్లో కూడా పరుగుల వరద పారిస్తూ 47 మ్యాచుల్లో 2,442 పరుగులు చేసి 10 సెంచరీలు జారవిడిచాడు.
పాతికేళ్లుగా చెక్కుచెదరని సచిన్ 12 సెంచరీల మ్యాజిక్
భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే ఒకే ఏడాదిలో 10 అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఘనత కేవలం ఈ నలుగురు బ్యాటర్లకు మాత్రమే దక్కింది. విరాట్ కోహ్లీ రెండుసార్లు సచిన్ రికార్డుకు దగ్గరగా వెళ్లినప్పటికీ ఆఖరి అడుగులో 12 సెంచరీల మైలురాయిని తాకలేకపోయాడు. ప్రస్తుత ఆధునిక క్రికెట్‌లో మూడు ఫార్మాట్ల పనిభారం పెరుగుతున్న నేపథ్యంలో సచిన్ 1998లో నెలకొల్పిన 12 సెంచరీల రికార్డును దాటడం రాబోయే తరం బ్యాటర్లకు సైతం పెద్ద సవాలుగా మారనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
