AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. 22A భూములు, ఉద్యోగుల డీఏపై ఉత్కంఠ!

నేటి తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. మెట్రో విస్తరణ, మూసీ రివర్ ప్రాజెక్టు, RRR నిర్మాణంతో పాటు ఉద్యోగుల డీఏ, పీఆర్సీపై నిర్ణయాలు తీసుకోనున్నారు. సంక్షేమ పథకాలు, 22A భూముల సమస్యలు, నీరు, విద్యుత్ సరఫరాపై సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఈ నిర్ణయాలుండనున్నాయి.

ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. 22A భూములు, ఉద్యోగుల డీఏపై ఉత్కంఠ!
Telangana Cabinet Meeting
Balaraju Goud
|

Updated on: Oct 01, 2026 | 7:04 AM

Share

మెట్రో నుంచి మూసీ వరకు.. RRR నుంచి ఉద్యోగుల డీఏ వరకు.. సంక్షేమ పథకాల నుంచి నీరు,విద్యుత్‌ వరకు.. ఇలాంటి కీలక అంశాలన్ని ఇవాళ్టి తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ టేబుల్‌పైకి రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనున్న భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఇవాళ్టి కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు…? ఏ ప్రతిపాదనలకు ఆమోదం లభించనుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇవాళ్టి కేబినెట్‌ భేటీకి కీలక అజెండా సిద్ధమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన గ్లోబల్‌ సమ్మిట్‌–2026 నిర్వహణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సమ్మిట్‌ నిర్వహణ, ఏర్పాట్లు, శాఖల సమన్వయంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌ మెట్రోపై కూడా కీలక చర్చ జరగనుంది. మెట్రో ఫేజ్‌–1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంశం కేబినెట్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఫేజ్‌–1 విలువ, ఆర్థిక భారం, నిధుల సమీకరణపై ఇప్పటికే కేంద్రంతో చర్చలు జరిగాయి. సమగ్ర అధ్యయనం కోసం SBICAPS‌ను కన్సల్టెంట్‌గా నియమించినట్లు ప్రభుత్వం గతంలో వెల్లడించింది. మెట్రో ఫేజ్‌–2 విస్తరణ, నిర్మాణ వ్యయం, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతుల అంశాలపైనా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.

మూసీ రివర్‌ రివైటలైజేషన్‌ ప్రాజెక్టుపైనా కేబినెట్‌ దృష్టి సారించనుంది. తదుపరి దశ పనులు, అవసరమైన భూసేకరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణ పనులు, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలపైనా మంత్రివర్గం సమీక్షించనుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ అంశాలు కూడా కేబినెట్‌ అజెండాలో ఉన్నాయి. డీఏ, పీఆర్సీ, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు, పరిపాలనా అంశాలు, ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండు డీఏల చెల్లింపుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న సమాచారంతో ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.

సంక్షేమ పథకాలపైనా ప్రభుత్వం ఫోకస్‌ పెట్టనుంది. ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించిన విధివిధానాలు, పంపిణీ ప్రక్రియపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించే రాజీవ్‌ యువ వికాసం పథకం విధివిధానాలు, అమలు ప్రక్రియ, ప్రారంభ తేదీపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు 22A భూముల అంశం కూడా కేబినెట్‌లో చర్చకు రానుంది. నిషేధిత భూముల జాబితా, ధరణి రికార్డుల్లో ఉన్న సమస్యలు, భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. అటు… ఎల్‌నినోతో రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, రిజర్వాయర్లలో నీటి లభ్యతపై కూడా కేబినెట్‌ సమీక్షించనుంది. రానున్న కాలంలో నీటి అవసరాలు, నిర్వహణపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే… పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌, సరఫరా పరిస్థితి, రానున్న సీజన్‌లో విద్యుత్‌ అవసరాలు, ఉత్పత్తి–కొనుగోలు అంశాలపైనా కేబినెట్‌ దృష్టి పెట్టనుంది.

మొత్తంగా… పెట్టుబడుల నుంచి మౌలిక వసతుల వరకు… ఉద్యోగుల నుంచి సంక్షేమం వరకు… నీటి నుంచి విద్యుత్‌ వరకు… అనేక కీలక అంశాలు ఇవాళ్టి కేబినెట్‌ ముందుకు రానున్నాయి. అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు…? ఏ ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తారు…? అన్నది చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us