ఉమెన్స్ ప్రీమియర్ లీగులో భాగంగా జరుగుతున్న 13వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనిపై ఆమె మాట్లాడుతూ వికెట్ తాజాగా ఉందని, వీలైనంత మేరకు పిచ్‌ను ఉపయోగించుకుంటామని తెలిపింది. అలాగే వరుస ఓటములు ఎదురవుతున్నా అభిమానులు అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసింది. వారిని ఆనందంలో ముంచెత్తేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. అనంతరం యూపీ వారియర్జ్ కెప్టెన్ అలీసా హీలీ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగే ఎంచుకోవాలని అనుకున్నామని తెలిపింది. బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడి మంచి స్కోర్ చేసేందుకు ఇదో చక్కని అవకాశమని తెలిపింది. అలాగే షబ్నిమ్ ఇస్మాయిల్ స్థానంలో గ్రేస్ హ్యారిస్‌ను జట్టులోకి తీసుకున్నామని తెలిపింది. పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆర్‌సీబీ గట్టి పోటీనిస్తారని భావిస్తున్నట్లు తెలిపింది.