మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవు: ధోనితో రిలేషన్ పై హర్భజన్ షాకింగ్ కామెంట్స్..
హర్భజన్ సింగ్ ధోనీతో స్నేహ బంధం దూరమైన విషయం గురించి ఓపెన్ అయ్యారు. ఐపీఎల్ సమయంలో మాత్రమే వారు మాట్లాడారని, అది కూడా ఆట వరకే పరిమితమైందని చెప్పారు. ధోనికి కాల్ కి స్పందన లేకపోవడంతో ధోనీతో తిరిగి మాట్లాడేందుకు ప్రయత్నించలేదని హర్భజన్ వెల్లడించారు.
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) గురించి మాజీ ఆఫ్-స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ధోనీతో స్నేహం లేదని, గత 10 ఏళ్లుగా తాము మాట్లాడుకోలేదని వెల్లడించారు. 2018 నుండి 2020 వరకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సమయంలో కూడా, వారి సంభాషణలు ఆట విషయాలకు మాత్రమే పరిమితమయ్యాయని ఆయన తెలిపారు.
“నేను ధోనీతో మాట్లాడను. మా మధ్య పదేళ్లుగా ఎలాంటి సంభాషణ లేదు. నాకు ఆయనపై ఎలాంటి కోపం లేదు. కానీ, ధోనీనే ఎందుకు మాట్లాడటం లేదో నాకు తెలియదు. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడినప్పుడు మాత్రమే మేము మాట్లాడాం, అది కూడా కేవలం ఆటపైనే. ధోనీ నా గదికి రాలేదు, నేను కూడా ఆయన గదికి వెళ్లలేదు,” అని హర్భజన్ పేర్కొన్నారు.
నాకు ఆయనపై ఎలాంటి ద్వేషం లేదు. ఆయనకు ఏదైనా చెప్పాలనిపిస్తే ఇప్పటి వరకు చెప్పేవారు. “నేను ధోనీకి ఫోన్ చేయను. నా కాల్స్‌కి స్పందించే వారికే ఫోన్ చేస్తాను. నా సమయం విలువైనది, దానికి తగిన వారిని మాత్రమే పిలుస్తాను. స్నేహ బంధం అనేది ఇరువురి మధ్య గౌరవంతో కొనసాగాలి. నేను గౌరవిస్తే, ఎదురు నుంచి కూడా గౌరవం ఆశిస్తాను,” అని హర్భజన్ చెప్పారు.
స్నేహం అనేది ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఒకట్రెండు సార్లు ప్రయత్నించి స్పందన లేకపోతే, ఇక తిరిగి పిలవను. అవసరమైనప్పుడు మాత్రమే కలుస్తాను,” అని స్పష్టం చేశారు.
ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రెండు విజయాల్లో హర్భజన్ భారత్ తరపున కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ చివరిసారిగా 2015లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో కలిసి ఆడారు. ఆ మ్యాచ్‌లో హర్భజన్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 70 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్‌లో భారత్ 214 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.