Video: టీమిండియా ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. KKRతో మ్యాచ్‌కు ముందు వాగ్దానం.. సీన్ కట్‌చేస్తే..
Best Finishers in IPL: లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ చౌదరి ఐపీఎల్ 2026లో సృష్టించిన విధ్వంసం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అసాధ్యమనుకున్న విజయాన్ని అందించిన ఈ యువ ఆటగాడి ప్రతిభను ప్రధాన శిక్షకుడు జస్టిన్ లాంగర్ ముందే గుర్తించాడు. ముకుల్‌ను భారత్‌లోనే అత్యంత ప్రమాదకరమైన ఫినిషర్‌గా మారుస్తానని లాంగర్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Mukul Choudhary Batting: కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో జట్టు గెలుపుపై ఆశలు వదులుకున్న వేళ ముకుల్ చౌదరి క్రీజులోకి వచ్చాడు. 182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 16 ఓవర్లకు 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం తన మూడవ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న 21 ఏళ్ల ముకుల్, ఏమాత్రం బెరుకు లేకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా చివరి 19 బంతుల్లోనే 52 పరుగులు రాబట్టి, ఆఖరి బంతికి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
మ్యాచ్ కు ముందే జస్టిన్ లాంగర్ జోస్యం..
ఈ అద్భుత విజయం తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకుంది. అందులో శిక్షణ సమయంలో లాంగర్ ముకుల్‌తో మాట్లాడుతూ.. “రాబోయే నాలుగు నెలల్లో, నిన్ను భారతదేశంలోనే అత్యంత భయంకరమైన నంబర్ 6 లేదా 7 బ్యాటర్‌గా మారుస్తాను” అని చెప్పడం కనిపిస్తుంది. లాంగర్ నమ్మకాన్ని నిజం చేస్తూ ముకుల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ పెద్ద షాట్లు ఆడగల సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది.
కష్టాల నుంచి డేంజరస్ హిట్టర్ వరకు ముకుల్ ప్రయాణం..
What JL said 🧿 pic.twitter.com/c7y4oI4Sgn
— Lucknow Super Giants (@LucknowIPL) April 9, 2026
రాజస్థాన్‌లోని ఝుంఝును ప్రాంతానికి చెందిన ముకుల్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. సరైన వసతులు లేని గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన, 12 ఏళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టాడు. తండ్రి కన్న కలని నిజం చేసేందుకు సికార్, జైపూర్ వంటి నగరాల్లో కఠిన శిక్షణ పొందాడు. ఆధునిక క్రికెట్‌కు అనుగుణంగా తన శైలిని మార్చుకోవడానికి గురుగ్రామ్‌లో ప్రత్యేకంగా సాధన చేశాడు. “బంతి నా పరిధిలోకి వస్తే బాదడమే నాకు తెలుసు” అని చెప్పే ముకుల్, తన ఆత్మవిశ్వాసమే తన బలమని చాటిచెప్పాడు. ఈ విజయంతో భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా ముకుల్ అవతరించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
