Mithali Raj: మహిళల క్రికెట్‌ రూపురేఖలను మార్చేసిన మిథాలీ.. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో లేడీ సచిన్‌ సాధించిన ఘనతలివే..

Mithali Raj Retirement: కొన్నేళ్ల క్రితం వరకు పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కి ఉండే ఆదరణ చాలా తక్కువ. మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేవారి సంఖ్య కూడా అంతంతమాత్రమే. ఆఖరకు మహిళా క్రికెటర్లకు చెల్లించే జీతాలు, సదుపాయాల్లో కూడా ఎంతో వ్యత్యాసముండేది.

Mithali Raj: మహిళల క్రికెట్‌ రూపురేఖలను మార్చేసిన మిథాలీ.. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో లేడీ సచిన్‌ సాధించిన ఘనతలివే..
Mithali Raj
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2022 | 4:25 PM

Mithali Raj Retirement: కొన్నేళ్ల క్రితం వరకు పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కి ఉండే ఆదరణ చాలా తక్కువ. మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేవారి సంఖ్య కూడా అంతంతమాత్రమే. ఆఖరకు మహిళా క్రికెటర్లకు చెల్లించే జీతాలు, సదుపాయాల్లో కూడా ఎంతో వ్యత్యాసముండేది. అంతెందుకు సచిన్‌, ధోని తెలిసినట్లుగా చాలామందికి మహిళా క్రికెటర్ల పేర్లు కూడా పెద్దగా గుర్తుండేవి కావు. అయితే ఒకే ఒక క్రికెటర్‌ మహిళల క్రికెట్‌ గతిని, రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. పురుషులకు దీటుగా మహిళల క్రికెట్‌ను తీర్చిదిద్దింది. వ్యక్తిగతంగానే రాణిస్తూ నాయకత్వ ప్రతిభతో టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించింది. ఆమె కారణంగానే మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లున్నాయంటే ఇప్పుడు చాలామంది టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆమె లేడీ సచిన్‌ మిథాలీరాజ్‌ (Mithali Raj). అంతర్జాతీయ క్రికెట్‌లో 23 ఏళ్ల సుదీర్ఘ సమయం పాటు టీమిండియాకు సేవలందించిన ఆమె తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు, త్వరలోనే సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తానంటూ ట్విట్టర్ వేదికగా తెలిపింది. దీంతో ఆమె అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. మిథాలీ మెరుపులను ఇక మైదానంలో చూడలేమంటూ పోస్టులు పెడుతున్నారు.

23 ఏళ్ల పాటు..

మిథాలీ రాజ్ 1982 డిసెంబర్ 3న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించింది. తండ్రి ధీరజ్ మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి. తండ్రి కూడా స్వతహాగా క్రికెటర్ కావడంతో మిథాలీను ప్రోత్సహించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. మిథాలీ పర్యటన ఖర్చుల కోసం సొంత ఖర్చులు తగ్గించుకుంటూ వచ్చారు. క్రికెట్‌తో పాటు భరత నాట్యంలోనూ శిక్షణ తీసుకుంది మిథాలీ. ఒక వేళ క్రికెటర్‌ కాకపోయి ఉంటే కళాకారిణిగా స్థిరపడేదాన్నని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇక మిథాలీ 1999 నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆడిన తన తొలి వన్డేలో ఐర్లాండ్‌పై 114 పరుగులు సాధించి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. ఇక 2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్ పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 214 పరుగులతో కెరీర్‌ బెస్ట్‌ స్కోర్‌ సాధించింది. మిథాలీ 2005లో జరిగిన మహిళా ప్రపంచ కప్ క్రికెట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించింది. అదేవిధంగా 2010, 2011, 2012లో వరుసగా ఐసీసీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సొంతం చేసుకుంది. మొత్తం 23 ఏళ్ల కెరీర్‌లో 232 వన్డేల్లో 7శతకాలు, 64అర్ధశతకాలతో 7805 పరుగులు చేసిందీ లెజెండరీ క్రికెటర్‌. 89 టీ20ల్లో 2364పరుగులు చేయగా.. అందులో 17 అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే, 12 టెస్టుల్లో ఒక శతకం, నాలుగు అర్ధ శతకాలతో 699 పరుగులు చేసింది.1999 జూన్‌ 26న తన తొలి మ్యాచ్‌ ఆడిన మిథాలీ.. 2022 మార్చి 27న చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడింది.

ఇవి కూడా చదవండి

లేడీ సచిన్‌గా గుర్తింపు..

కాగా మహిళా క్రికెట్‌లో సుదీర్ఘకాలంగా ఆడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది మిథాలి రాజ్‌. 23 ఏళ్లుగా ఆడుతూ అన్ని ఫార్మాట్‌లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డులు తన పేరిట లిఖించుకుంది. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ను వెనక్కినెట్టి లేడీ సచిన్‌ టెండూల్కర్‌’గా ప్రశంసలందుకుంది. 2017 మహిళల ప్రపంచ కప్ లో వరుసగా ఏడు అర్ధసెంచరీలు చేసిన ఈ దిగ్గజ క్రికెటర్‌.. వరల్డ్ కప్ లో చేసిన 1000 పరుగులు చేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్‌గా, ప్రపంచంలో ఐదో మహిళా క్రికెటర్‌గా అరుదైన ఘనతలను అందుకుంది. ఇక 2021 సెప్టెంబర్‌ ఆస్ట్రేలియా పర్యటనలో అరుదైన మైలురాయి అందుకుంది. టెస్టు, వన్డే, లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్‌లలో కలిపి 20 వేల పరుగులు చేసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ప్రపంచ క్రికెట్‌లో 200పైగా వన్డే మ్యాచ్‌లు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్ కూడా మిథాలీనే.

వరించిన అవార్డులివే.. *2003లో అర్జున అవార్డు

*2015లో పద్మశ్రీ అవార్డు

*2017 యూత్ స్పోర్ట్స్ ఐకాన్ ఎక్సలెన్స్ అవార్డు

*2017 బీబీసీ-100 ఉమెన్ అవార్డు

*2017 విజ్డన్ లీడింగ్ ఉమెన్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డు

*నవంబర్ 13, 2021.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డును అందుకుంది

Also Read:

RRR Movie: ఓటీటీలోనూ అదరగొడుతోన్న ఆర్‌ఆర్‌ఆర్‌.. నాన్‌ ఇంగ్లిష్‌ సినిమాల్లో వరుసగా రెండు వారాల పాటు..

Mithali Raj Retirement: మిథాలీ రాజ్‌ సంచలన నిర్ణయం..అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన లేడీ మాస్టర్‌ బ్లాస్టర్‌..

TS TET 2022: టెట్‌ అభ్యర్థుల్లో సందిగ్ధం.. అదే రోజు మరో పరీక్ష.. డేట్ మార్పుపై తగ్గేదే లే అంటున్న మంత్రి సబితా