IPL 2026 : సైలెంటుగా ఉంటే పనవ్వదు.. ఆ ప్లేయర్లా అగ్రెస్సివ్ గా ఉండాల్సిందే…బౌలర్లకు గిల్ సలహా
IPL 2026 : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బౌలర్లకు కీలక సూచనలు చేశారు. కోచ్ ఆశిష్ నెహ్రా లాగే అగ్రెసివ్‌గా ఉండాలని, ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. ఈసారి ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ బలమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగంతో బరిలోకి దిగుతోంది.

IPL 2026 : ఐపీఎల్ 2026 సమరం మొదలవ్వడానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య పోరు మొదలవ్వకముందే, మాటల యుద్ధం అప్పుడే వేడెక్కింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తన జట్టులోని ఫాస్ట్ బౌలర్లు మైదానంలో చాలా అగ్రెసివ్‌గా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. తన జట్టు కోచ్, మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఆటగాడిగా ఉన్నప్పుడు ఎంతటి కసిగా ఉండేవారో, తన బౌలర్లు కూడా అలాగే ఉండాలని గిల్ స్పష్టం చేశారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శుభ్‌మన్ గిల్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రముఖ యాంకర్ మందిరా బేడీతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. తన జట్టు పేసర్లు మైదానంలో చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలని చెప్పారు. “మా టీమ్ బౌలర్లు శాంతంగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. వారు మా హెడ్ కోచ్ ఆశు పా (నెహ్రా) లాగే అగ్రెసివ్‌గా ఉండాలి. నెహ్రా ఆడే రోజుల్లో ఎవరైనా క్యాచ్ వదిలేస్తే లేదా మిస్ ఫీల్డ్ చేస్తే ఎంతలా అరిచేవారో మీరు వీడియోల్లో చూసే ఉంటారు. మా బౌలర్లలో కూడా అదే కసి కనిపించాలి” అని గిల్ వ్యాఖ్యానించారు.
ఆశిష్ నెహ్రా ఆటగాడిగా ఉన్నప్పుడు తన బౌలింగ్‌లో ఫీల్డర్లు పొరపాట్లు చేస్తే అస్సలు సహించేవారు కాదు. సొంత జట్టు సభ్యులపైనే మైదానంలో కేకలు వేసేవారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. చివరికి ఎంఎస్ ధోనీపై కూడా నెహ్రా కోప్పడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే తరహా దూకుడును గుజరాత్ బౌలర్లు ప్రదర్శించాలని గిల్ ఆకాంక్షిస్తున్నారు. మైదానంలో బౌలర్లు అగ్రెసివ్‌గా ఉంటేనే ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుందని గిల్ నమ్మకం.
ఈసారి ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ అత్యంత బలమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగంతో బరిలోకి దిగుతోంది. ఇందులో కగిసో రబాడ, మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ల్యూక్ వుడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ, జేసన్ హోల్డర్ వంటి స్టార్ పేసర్లు ఉన్నారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ గత సీజన్‌లో పర్పుల్ క్యాప్ విన్నర్ కావడం విశేషం. ఆయన 15 మ్యాచుల్లో 25 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. ఇంతటి బలమైన బౌలింగ్ అటాక్ ఉంటే ప్రత్యర్థులకు చుక్కలు కనిపించడం ఖాయం.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో 14 మ్యాచుల్లో 9 విజయాలు సాధించినప్పటికీ, ప్లేఆఫ్స్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. “గత ఏడాది మేము గొప్ప క్రికెట్ ఆడాం, కానీ దురదృష్టవశాత్తు ట్రోఫీ గెలవలేకపోయాం. ఈసారి ఆ తప్పులను సరిదిద్దుకుని మళ్ళీ విజేతగా నిలుస్తాం. మా ఆటతీరులో మార్పు ఉండదు, అదే బ్రాండ్ క్రికెట్‌ను కొనసాగిస్తాం” అని గిల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
