IPL 2023, Virat Kohli: టోర్నీ నుంచి ఆర్‌సీబీ నిష్క్రమణపై కోహ్లీ ఎమోషనల్ పోస్ట్.. ‘మరింత దృఢంగా తిరిగొస్తాం’ అంటూ..
Virat Kohli's Emotional Post: ఐపీఎల్ అంటేనే సర్వత్రా ఉత్కంఠ.. చివరి బంతి వరకు ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా వీలు కాదు. ఒక్క బంతితో ఆట స్వరూపం మారిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అటువంటి ఐపీఎల్ టోర్నీ నుంచి..
Virat Kohli’s Emotional Post: ఐపీఎల్ అంటేనే సర్వత్రా ఉత్కంఠ.. చివరి బంతి వరకు ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా వీలు కాదు. ఒక్క బంతితో ఆట స్వరూపం మారిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అటువంటి ఐపీఎల్ టోర్నీ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అనూహ్యంగా నిష్క్రమించింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిన ఆర్‌సీబీ మరో సారి ట్రోఫీ గెలవకుండానే టోర్నీ నుంచి వైదొలగింది. దీనిపై అటు టీమ్ ప్లేయర్లు, ఇటు ఆర్‌సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సంచరీతో చెలరేగినా.. ఆర్‌సీబీ ఓడిపోవడాన్ని ఎవరూ ఆపలేకపోయారు.
అయితే కీలక మ్యాచ్‌లో ఓటమి, టోర్నీ నుంచి నిష్క్రమణ నేపథ్యంలో కింగ్ కోహ్లీ కొంచెం ఎమోషనల్‌గా స్పందించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టా ఖాతా నుంచి ‘థాంక్ యూ బెంగళూరు’ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. అందులో కోహ్లీ ‘ఈ సీజన్ మాకు ఎన్నో మధుర క్షణాలను అందించింది. కానీ, దురదృష్టవశాత్తు మేము లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాం. నిరాశ చెందాము. ఆద్యంతం మాకు మద్దతిచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. అడుగడుగునా అండగా నిలిచిన కోచ్‌లు, మేనేజ్‌మెంట్, నా సహచర ఆటగాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు. మేం మరింత దృఢంగా తిరిగి వస్తాం @రాయల్ చాలెంజర్స్ బెంగళూరు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇక కోహ్లీ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంకా వెనకడుగు వేయని కోహ్లీ పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై సూపర్ విక్టరీ సాధించి, అభిమానులలో ఆశలు రేపిన ఆర్‌సీబీ.. కీలక మ్యాచ్‌లో ఓటమిపాలై సీజన్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేశారు. ఈ క్రమంలో కోహ్లీ 101 పరుగులు సెంచరీతో అజేయంగా నిలిచాడు. అనంతరం వచ్చిన గుజరాత్ బ్యాటర్స్‌పై బెంగళూరు బౌలర్లు తేలిపోయారు. ఇక గుజరాత్ తరఫున శుభమాన్ గిల్ సూపర్ సెంచరీతో కీలక మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమికి కారణంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్ 6 వికెట్ల తేడాతో బెంగళూరును మట్టికరిపించింది. అలా ఆర్‌సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.