AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20 హిస్టరీలో టీమిండియా లోయోస్ట్ స్కోర్లు.. టాప్ 5లో తొలిపేరు చూస్తే నమ్మలేరంతే..!

India Lowest T20I Score: క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే భారత బ్యాటింగ్ లైనప్ కొన్నిసార్లు పేకమేడలా కూలిపోయి అభిమానుల గుండెల్ని గాయపరిచింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత పురుషుల జట్టు అత్యంత తక్కువ పరుగులకే ఇన్నింగ్స్ ముగించిన ఆ ఐదు చీకటి రోజులు, ఆయా మ్యాచ్‌ల పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

టీ20 హిస్టరీలో టీమిండియా లోయోస్ట్ స్కోర్లు.. టాప్ 5లో తొలిపేరు చూస్తే నమ్మలేరంతే..!
Lowest Team Totals India T20i
Venkata Chari
|

Updated on: Jul 08, 2026 | 7:44 AM

Share

Lowest Team Totals India T20I: ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న భారత క్రికెట్ జట్టుకు కొన్ని రోజులుగా అస్సలు కలిసిరావడం లేదు. ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తరుణంలో, టీమిండియా చరిత్రలోనే నమోదైన అత్యల్ప స్కోర్ల వివరాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

1. 74 పరుగులు – ఆస్ట్రేలియాపై (మెల్బోర్న్, 2008): ఇది భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన, అత్యల్ప స్కోరుగా రికార్డు పుటల్లో నిలిచిపోయింది. 2008లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా, మెల్బోర్న్ మైదానంలో కంగారూల పేస్ ధాటికి తట్టుకోలేకపోయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు క్రీజులోకి రావడం, వెళ్లడం అన్నట్లుగా సాగింది. ఫలితంగా కేవలం 17.3 ఓవర్లలోనే కేవలం 74 పరుగులకే భారత ఇన్నింగ్స్ ముగిసింది.

ఇది కూడా చదవండి: ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!

ఇవి కూడా చదవండి

2. 76 పరుగులు – ఇంగ్లాండ్‌పై (నాటింగ్‌హామ్, 2026): భారత క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. ప్రపంచ ఛాంపియన్ హోదాలో ఉన్న భారత జట్టు ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఈ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రేయాస్ అయ్యర్ సేన, ప్రత్యర్థి బౌలర్లు జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్ల వేగానికి చేతులెత్తేసింది. కేవలం 11.4 ఓవర్లలోనే 76 పరుగులకే ఆలౌట్ అయింది. పరుగుల పరంగా (125 పరుగులు) టీమిండియాకు ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.

3. 79 పరుగులు – న్యూజిలాండ్‌పై (నాగ్‌పూర్, 2016): 2016లో స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఈ షాకింగ్ ఘోర పరాజయం ఎదురైంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కేవలం 126 పరుగుల సాదాసీదా స్కోరు మాత్రమే చేసింది. సొంత గడ్డపై ఈ లక్ష్యం చాలా సులువు అని భావించిన అభిమానులకు కివీస్ స్పిన్నర్లు గట్టి షాక్ ఇచ్చారు. పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో భారత బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. చివరకు 18.1 ఓవర్లలో కేవలం 79 పరుగులకే టీమిండియా చాపచుట్టేసింది.

4. 81/8 పరుగులు – శ్రీలంకపై (కొలంబో, 2021): 2021లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత ప్రధాన జట్టులోని సగానికి పైగా ఆటగాళ్లకు కరోనా సోకడంతో శికర్ ధావన్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి యువ జట్టుతో బరిలోకి దిగాల్సి వచ్చింది. కొలంబో వేదికగా జరిగిన నిర్ణీత మూడో టీ20 మ్యాచ్‌లో అనుభవం లేని భారత యువ బ్యాటర్లు లంక స్పిన్ మాంత్రికుడు వానిందు హసరంగా బౌలింగ్‌లో తీవ్రంగా తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లు ఆడినప్పటికీ 8 వికెట్ల నష్టానికి కేవలం 81 పరుగులు మాత్రమే చేయగలిగారు.

ఇది కూడా చదవండి: టాస్‌లో హీరో.. మ్యాచ్‌లో జీరో.. టీమిండియా పాలిట విలన్‌లా మారిన శ్రేయాస్ అయ్యర్..!

5. 92 పరుగులు – దక్షిణాఫ్రికాపై (కటక్, 2015): 2015లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఈ ఘోర పరాభవం ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ప్రొటీస్ బౌలర్ల క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ముందర నిలవలేకపోయింది. కేవలం 17.2 ఓవర్లలోనే 92 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల వైఫల్యానికి ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు మైదానంలోకి బాటిళ్లు విసిరి రచ్చ చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

సూర్యుడికి కూడా గ్రహణం పడుతుందనే చందంగా, ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టు కూడా కొన్ని రోజుల్లో ఇలాంటి ఘోరమైన పతనాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే, ప్రతి ఓటమి నుంచి సరికొత్త పాఠాలు నేర్చుకుంటూ మళ్లీ సింహంలా గర్జించడం టీమిండియాకు కొత్తేమీ కాదు. ఈ అప్రతిష్టల నుంచి త్వరలోనే కోలుకుని భారత జట్టు మళ్లీ విజయాల బాట పడుతుందని ఆశిద్దాం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us