హైదరాబాద్ ప్రయాణికుడికి చేదు అనుభవం.. భారీ పరిహారం చెల్లించాలని రైల్వేకు కోర్టు ఆదేశం!
రైలు దారి మళ్లించిన విషయాన్ని ముందుగా తెలియజేయకపోవడంతో ఓ ప్రయాణికుడు వ్యాపార సమావేశం, విమానం రెండింటినీ కోల్పోయాడు. ఈ కేసులో హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ దక్షిణ రైల్వేను రూ.35,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రయాణికులకు సకాలంలో సమాచారం ఇవ్వడం రైల్వే బాధ్యత అని కమిషన్ స్పష్టం చేసింది.

రైలు దారి మళ్లింపుపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఓ ప్రయాణికుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలో దక్షిణ రైల్వేకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికుడికి రూ.35,000 నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. రైలు ఆలస్యం కారణంగా అతను వ్యాపార సమావేశంతో పాటు తిరుగు ప్రయాణ విమానాన్ని కూడా కోల్పోయినట్లు కమిషన్ గుర్తించింది.
కేసు వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన జీడిపప్పు వ్యాపారి రామకృష్ణ 2024 సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో జరిగే బిజినెస్ మీటింగ్‌కి హాజరయ్యేందుకు చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్లే తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో రూ.1,428 విలువైన ప్రీమియం తత్కాల్ టికెట్‌ను బుక్ చేసుకున్నారు. సెప్టెంబర్ 28న చెన్నై రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాతే రైలును వేరే మార్గంలో మళ్లించిన విషయం ఆయనకు తెలిసింది. ఈ మార్పు గురించి తనకు ఎలాంటి ఎస్‌ఎంఎస్ లేదా ముందస్తు సమాచారం ఇవ్వలేదని రామకృష్ణ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రైలు దారి మళ్లింపుతో సుమారు 16 గంటలు ఆలస్యంగా న్యూఢిల్లీ చేరుకోవడంతో ఆయన తన మీటింగ్‌ను మిస్ అయ్యారు. అంతేకాకుండా తిరుగు ప్రయాణానికి బుక్ చేసుకున్న విమానం కూడా మిస్ కావడంతో ఆర్థికంగా, మానసికంగా నష్టపోయినట్లు పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కారణంగానే రైలును మళ్లించాల్సి వచ్చిందని దక్షిణ రైల్వే వివరణ ఇచ్చింది. అయితే రైలు మార్గం మారిన విషయాన్ని విజయవాడ, ఖమ్మం, వరంగల్, నాగ్‌పూర్ వంటి స్టేషన్లలో ఎక్కే ప్రయాణికులకు మాత్రమే ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేశామని, చెన్నైలో ఎక్కిన ప్రయాణికులకు అలాంటి సమాచారం పంపలేదని రైల్వే అధికారులు అంగీకరించారు. ఈ అంశాన్ని పరిశీలించిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్, ముందస్తు సమాచారం ఇవ్వడంలో రైల్వే విఫలమైందని స్పష్టం చేసింది.
సమయానికి సమాచారం అందించి ఉంటే ప్రయాణికుడు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉండేదని అభిప్రాయపడింది. వ్యాపార నష్టాలకు సంబంధించి తగిన ఆధారాలు సమర్పించనప్పటికీ, మానసిక వేదన, అసౌకర్యం, విమానం కోల్పోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. దీంతో ప్రయాణికుడికి మానసిక వేదనకు రూ.25,000, వ్యాజ్య ఖర్చుల కింద రూ.10,000 కలిపి మొత్తం రూ.35,000 నష్టపరిహారం చెల్లించాలని దక్షిణ రైల్వేను కమిషన్ ఆదేశించింది. ప్రయాణికులకు కీలక సమాచారం సకాలంలో అందించడం రైల్వే బాధ్యత అని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
