ఆన్‌లైన్‌లో చవక నగలు కొంటున్నారా? జాగ్రత్త.. 9000 రెట్లు క్యాన్సర్ కారకాల గుర్తింపు!
ఆన్‌లైన్‌లో చవకగా విక్రయిస్తున్న వెండి, ఫ్యాషన్ ఆభరణాల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే కాడ్మియం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. కొన్ని నగల్లో చట్టబద్ధ పరిమితి కంటే 9,000 రెట్లు ఎక్కువ కాడ్మియం గుర్తించారు. ముఖ్యంగా పిల్లలకు ఇవి తీవ్ర ఆరోగ్య ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయిస్తున్న చవకైన వెండి ఆభరణాల్లో క్యాన్సర్ కారక కాడ్మియం 9,000 రెట్లు ఎక్కువగా ఉందని షాకింగ్ నిజం బయటపడింది. అందంగా కనిపిస్తున్న ఈ నకిలీ నగలు కొనుగోలుదారుల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. ప్రముఖ బ్రిటిష్ పత్రిక ది సండే టైమ్స్ నిర్వహించిన దర్యాప్తులో ఈ-కామర్స్ వేదికలపై విక్రయిస్తున్న కొన్ని వెండి ఆభరణాల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే కాడ్మియం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఈ విషయం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. పరిశోధనలో భాగంగా 925 స్టెర్లింగ్ సిల్వర్ పేరుతో విక్రయిస్తున్న కొన్ని ఉంగరాలను పరీక్షించగా, వాటిలో ఏకంగా 92.3 శాతం కాడ్మియం ఉన్నట్లు బర్మింగ్‌హామ్ అస్సే ఆఫీస్ నిర్ధారించింది. చట్టపరంగా ఈ లోహం గరిష్ఠ పరిమితి కేవలం 0.01 శాతం మాత్రమే ఉండాలి. అంటే అనుమతించిన స్థాయి కంటే దాదాపు 9,000 రెట్లు ఎక్కువ కాడ్మియం ఉండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
అంతేకాదు సోషల్ మీడియా ప్రకటనలు, రీల్స్ ద్వారా ప్రాచుర్యం పొందిన కొన్ని ఫ్యాషన్ చైన్లలో కూడా 33 శాతం కాడ్మియం ఉన్నట్లు గుర్తించారు. ఇది కూడా అనుమతించిన పరిమితి కంటే సుమారు 3,300 రెట్లు అధికం. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో సంబంధిత ఈ-కామర్స్ సంస్థలు ఆయా ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించినట్లు సమాచారం. వైద్య నిపుణుల ప్రకారం కాడ్మియం అత్యంత ప్రమాదకరమైన భారీ లోహాల్లో ఒకటి. ఇది శరీరంలో క్రమంగా పేరుకుపోయి కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను దెబ్బతీయడంతో పాటు క్యాన్సర్ ముప్పును కూడా పెంచే అవకాశం ఉంది. చిన్నపిల్లలు ఇలాంటి ఆభరణాలను నోట్లో పెట్టుకోవడం లేదా ఎక్కువసేపు ధరించడం వల్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతదేశంలో కూడా ఆన్‌లైన్ ద్వారా ఫ్యాషన్ ఆభరణాల కొనుగోళ్లు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో బీఐఎస్ హాల్‌మార్క్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని, వెండి లేదా ఫ్యాషన్ ఆభరణాలు కొనుగోలు చేసే ముందు విక్రేత విశ్వసనీయత, ఉత్పత్తి వివరాలు, ధృవీకరణ వంటి అంశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. తక్కువ ధరకు అందంగా కనిపిస్తున్న ప్రతి ఆభరణం సురక్షితమని భావించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తయారీ వివరాలు, నాణ్యత ధృవీకరణ లేని ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేసే ముందు ధర కంటే నాణ్యత, భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి.
