ఇంజిన్‌లో మార్పులు లేకుండానే Pulsar NS400Z కొత్త లుక్.. ఈసారి టార్గెట్ చేసిన ఫీచర్ ఇదే!
బజాజ్ పల్సర్ NS400Zలో త్వరలో కొత్త అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పల్సర్ లైనప్‌లోని పలు బైక్‌లకు TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను తీసుకొచ్చిన సంస్థ, ఇప్పుడు ఇదే ఫీచర్‌ను NS400Zలోనూ అందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త డిస్‌ప్లేతో ఉన్న బైక్ తాజాగా డీలర్‌షిప్‌లో కనిపించడంతో విడుదలపై అంచనాలు పెరిగాయి.

పల్సర్ NS400Z కొనాలనుకునేవారికి త్వరలో మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బైక్‌లో పెద్ద మెకానికల్ మార్పులు చేయకుండా, టెక్నాలజీ వైపు అప్‌డేట్ ఇవ్వాలని బజాజ్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 5 అంగుళాల TFT డిస్‌ప్లే, కొత్త రంగులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంజిన్, పనితీరులో మాత్రం మార్పులు ఉండకపోవచ్చని సమాచారం.
5 అంగుళాల TFT డిస్‌ప్లే..
NS400Zలో కనిపించిన ప్రధాన మార్పు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ప్రస్తుతం ఉన్న డిస్‌ప్లే స్థానంలో 5 అంగుళాల TFT యూనిట్‌ను తీసుకురావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే N160, 125, 150, NS200, N250 వంటి పల్సర్ మోడళ్లలో ఇలాంటి డిస్‌ప్లేను తీసుకొచ్చిన బజాజ్, ఇప్పుడు ఈ పెద్ద బైక్‌లోనూ అదే తరహా స్క్రీన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. కొత్త TFT స్క్రీన్ వల్ల బైక్‌కి ఆధునిక లుక్ రావడంతో పాటు, రైడింగ్ సమయంలో అవసరమైన సమాచారం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఏయే అదనపు ఫీచర్లు ఉంటాయనే వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.
ఇంజిన్‌లో మార్పులు..
కొత్త డిస్‌ప్లే వచ్చినా మెకానికల్ మార్పులు చేసే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న 349.13cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌నే కొనసాగించవచ్చని సమాచారం. ఈ ఇంజిన్ 40.6hp పవర్, 33.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఈ అప్‌డేట్‌లో ప్రధాన దృష్టి టెక్నాలజీ, డిజైన్‌పైనే ఉండనుంది. కొత్త కలర్ ఆప్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే బైక్ మొత్తం రూపంలో భారీ మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
ఇటీవల పరీక్షల్లో కనిపించిన NS200లో కొత్త WP ఫోర్క్ కనిపించినప్పటికీ, NS400Zలో అలాంటి మార్పు కనిపించలేదు. దీంతో ప్రస్తుత సమాచారం ప్రకారం TFT డిస్‌ప్లే, కొత్త రంగులే ప్రధాన అప్‌డేట్‌లుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బైక్ ధర సుమారు రూ.1.86 లక్షలు. కొత్త TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కారణంగా ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అయితే తుది ధరను బజాజ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
