జింబాబ్వేతో గెలుపు వెనక మాస్టర్‌మైండ్.. గంభీర్ కథ ముగిసినట్టేనా..?
Gautam Gambhir vs VVS Laxman: జింబాబ్వేతో యంగ్ ఇండియా గెలుపు కోచ్ పదవిపై సరికొత్త వివాదం తెరలేపింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాజయాల తర్వాత తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో యంగ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయంతో ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో లక్ష్మణ్‌ను బాధ్యతల్లోకి తీసుకోవాలనే డిమాండ్ అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది.

జింబాబ్వేతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవిపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్‌ను శాశ్వత ప్రాతిపదికన హెడ్ కోచ్‌గా నియమించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ముగిసిన యుకే పర్యటనలో భారత జట్టు తీవ్ర నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఓటమితో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 0-4తో ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌ను కూడా భారత్ కోల్పోయింది. ఈ వరుస ఓటముల తర్వాత భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో జింబాబ్వే పర్యటనకు వెళ్ళింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సపోర్ట్ స్టాఫ్‌కు విశ్రాంతినివ్వడంతో నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పర్యవేక్షణలో యంగ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తూ జింబాబ్వేను 3-0తో వైట్‌వాష్ చేసింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై లక్ష్మణ్ ప్రశంసల జల్లు
సిరీస్ విజయం అనంతరం బీసీసీఐఒక ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో వివిఎస్ లక్ష్మణ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ మాట్లాడటం ఇందులో కనిపిస్తుంది. నూతన అరంగేట్ర ఆటగాళ్లు అశోక్ శర్మ, యష్ ఠాకూర్‌లతో పాటు జట్టులోని యువ ఆటగాళ్లను నడిపించిన తీరుకు లక్ష్మణ్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ‘‘మొత్తం జట్టుకు అభినందనలు. సిరీస్ గెలవాలనే లక్ష్యంతోనే మనం ఇక్కడికి వచ్చాం. శ్రేయస్ అయ్యర్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. తన కెప్టెన్సీ కెరీర్ ఆరంభంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ, మొదటి మ్యాచ్‌కు ముందు రోజు జట్టుతో చేరినప్పటి నుంచే చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాడు. ఇంగ్లండ్ టూర్ నుంచి కేవలం నలుగురైదుగురు మాత్రమే ఈ పర్యటనకు వచ్చారు.. ఇదొక కొత్త టీమ్. అయినప్పటికీ శ్రేయస్ ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, జట్టును నడిపించిన తీరు నిజంగా ప్రశంసనీయం’’ అని లక్ష్మణ్ తెలిపారు.
నెట్టింట గంభీర్ వర్సెస్ లక్ష్మణ్
బీసీసీఐ ఈ వీడియోను పంచుకున్న వెంటనే సోషల్ మీడియాలో గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ విపరీతంగా పెరిగింది. వరుస ఓటముల తర్వాత జట్టును విజయపథంలో నడిపించిన లక్ష్మణ్ శైలికి నెటిజన్లు ఫిదా అయ్యారు. తాత్కాలిక బాధ్యతలే కాకుండా భారత టీ20 జట్టుకు లక్ష్మణ్‌నే పూర్తిస్థాయి హెడ్ కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.




