AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: గాల్ టెస్టులో 700 పరుగులు ఖాయమా?.. పిచ్‌ సీక్రెట్ లీక్ చేసిన లంక కెప్టెన్

IND vs SL: గాల్ టెస్టుకు ముందు శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా పిచ్‌పై కీలక అంచనా వేశారు. తొలి రెండు, మూడు రోజులు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాత స్పిన్నర్లకు సహకరిస్తుందని చెప్పారు. ప్రభాత్ జయసూర్య రికార్డు తమకు బలమని పేర్కొంటూ, టీమిండియా పునరాగమనంపై కూడా హెచ్చరిక చేశారు.

IND vs SL: గాల్ టెస్టులో 700 పరుగులు ఖాయమా?.. పిచ్‌ సీక్రెట్ లీక్ చేసిన లంక కెప్టెన్
India Vs Sri Lanka
Rakesh
|

Updated on: Aug 13, 2026 | 2:33 PM

Share

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు పిచ్ వాతావరణంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ మ్యాచ్‌పై శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా కీలక వ్యాఖ్యలు చేస్తూ గాల్ మైదానం తొలి మూడు రోజులు బ్యాటర్లకు పండగలా మారనుందని అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ పడుతున్న వర్షాల కారణంగా పిచ్ పూర్తిగా పొడిగా లేదని, వాతావరణ పరిస్థితుల వల్ల ప్రారంభంలో బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుందని శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా స్పష్టం చేశారు. సాధారణంగా శ్రీలంకలో తొలి రోజు నుంచే స్పిన్ తిరిగే వికెట్లు కనిపిస్తాయి. ప్రస్తుతం వర్షాల వల్ల పరిస్థితి వేరుగా ఉందని, మొదటి రెండు మూడు రోజులు బ్యాటర్లు భారీగా పరుగులు సాధించే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాతే పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు. గాల్ మైదానంలో గతంలో ఒకే ఇన్నింగ్స్‌లో 700 పరుగులు నమోదు కాగా, మరో ఐదు సందర్భాల్లో 600 పైగా పరుగులు నమోదైన రికార్డులు ఉన్నాయి.

జయసూర్య రికార్డే లంకకు కొండంత బలం

ఈ మైదానంలో శ్రీలంకకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయని ధనంజయ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య రికార్డు తమకు ఎంతో సానుకూలాంశమని పేర్కొన్నారు. జయసూర్య గాల్ మైదానంలో కేవలం 21 ఇన్నింగ్స్‌ల్లోనే 81 వికెట్లు పడగొట్టి, 9 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించారు. భారత ఆటగాళ్లతో పోలిస్తే ప్రభాత్‌కు ఈ మైదానంపై పూర్తి అవగాహన ఉందని, ఇది తమకు అదనపు బలంగా మారుతుందని చెప్పారు. అయినప్పటికీ ఇరు జట్ల మధ్య ఉన్న రికార్డులు చూస్తే టీమిండియాదే పైచేయిగా ఉంది. రెండు జట్లు ఆడిన 46 టెస్టుల్లో భారత్ 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, శ్రీలంక కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

టీమిండియా పునరాగమనంపై లంక హెచ్చరిక

న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్‌ల్లో భారత్ స్వదేశంలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ, ఆ జట్టును తక్కువ అంచనా వేయలేమని ధనంజయ అభిప్రాయపడ్డారు. పరాజయాల నుంచి త్వరగా కోలుకుని గట్టి పునరాగమనం చేయడం టీమిండియాకు అలవాటేనని గుర్తుచేశారు. భారత బ్యాటర్లు టర్నింగ్ వికెట్లపై ఆడటం మర్చిపోలేదని, ఖచ్చితంగా మ్యాచ్‌లో గట్టి పోటీ ఇస్తారని చెప్పారు. ఐదు రోజుల పాటు మ్యాచ్‌ను తీసుకెళ్లగలిగితే భారత్‌ను ఓడించే అవకాశాలు తమకు పెరుగుతాయని లంక కెప్టెన్ వ్యూహాన్ని వెల్లడించారు.

గాల్ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే సూచనలు కనిపిస్తుండటంతో ఈ టెస్టు మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా మారనుంది. ఆతిథ్య లంక జట్టు స్పిన్ అస్త్రాన్ని నమ్ముకోగా, స్వదేశీ సిరీస్ పరాజయాల నుంచి కోలుకుని విజయకేతనం ఎగరవేసేందుకు భారత్ పట్టుదలతో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us