AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: సంజు ఒంటరి పోరాటం వృథా.. మొదటి వన్డేలో టీమిండియాకు తప్పని ఓటమి..

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకోలేదనే నిరాశను పక్కన పెట్టి శాంసన్ (86 నాటౌట్) చక్కటి ఇన్నింగ్స్ ఆడినా భారత జట్టు విజయానికి సరిపోలేదు. పేలవమైన ఫీల్డింగ్, టాప్ ఆర్డర్‌ వైఫల్యంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.

IND vs SA: సంజు ఒంటరి పోరాటం వృథా.. మొదటి వన్డేలో టీమిండియాకు తప్పని ఓటమి..
Ind Vs Sa
Basha Shek
|

Updated on: Oct 07, 2022 | 12:43 AM

Share

భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకోలేదనే నిరాశను పక్కన పెట్టి శాంసన్ (86 నాటౌట్) చక్కటి ఇన్నింగ్స్ ఆడినా భారత జట్టు విజయానికి సరిపోలేదు. పేలవమైన ఫీల్డింగ్, టాప్ ఆర్డర్‌ వైఫల్యంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాపార్డర్‌ నిరాశపర్చినప్పటికీ క్లాసెన్, మిల్లర్ మధ్య భారీ మిడిల్ ఆర్డర్ భాగస్వామ్యం కారణంగా దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన టీమిండియా టాపార్డర్‌ వైఫల్యంతో నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు మాత్రమే చేసి 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (50) మాత్రమే రాణించారు.

సంజూ ఒంటరి పోరు..

250 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. యంగ్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (3) రబాడా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. కొద్దిసేపటికే పార్నెల్ బౌలింగ్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (4) కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడుతూ కనిపించిన రుతురాజ్‌ గైక్వాడ్‌ (19) కూడా పెద్దగా పరుగులేమీ చేయకుండానే షంసీ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ ఇషాన్‌ కిషన్‌(20)తో కలిసి ఇన్నింగ్స్‌కు చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే 51 పరుగుల వద్ద ఇషాన్‌ ఔటయ్యాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్‌ కూడా భారీషాట్‌కు ప్రయత్నించి రబాడాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అయితే సంజూ శాంసన్‌ ఒంటరి పోరాటం చేశాడు. సంయమనంతో ఆడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (33) విలువైన పరుగులు సాధించినా కుల్దీప్‌ యాదవ్‌ (0), ఆవేశ్‌ ఖాన్‌ (3), రవి బిష్ణోయ్‌ (4) పెద్దగా పరుగులేమీ చేయకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా, రబాడా 2 వికెట్లు నేలకూల్చాడు.

ఇవి కూడా చదవండి

కొంపముంచిన ఫీల్డింగ్‌ వైఫల్యం..

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ఆరంభంలో కట్టుదిట్టంగా బంతులు విసిరిన బౌలర్లు మిడిల్‌ ఓవర్లలో పట్టు సడలించారు. దీనికి తోడు ఫీల్డింగ్‌ వైఫల్యం టీమిండియా పాలిట శాపమైంది. దీంతో మిల్లర్‌ (75 నాటౌట్‌), క్లాసెన్‌ (74 నాటౌట్‌), డికాక్‌ (48) బౌండరీలతో చెలరేగిపోయారు. భారత బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్‌, కుల్దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆటగాళ్లు మొత్తం 3 మంచి క్యాచ్‌లను వదిలేశారు. మరి కొందరు మిస్ ఫీల్డింగ్ కారణంగా బౌండరీలు ఇచ్చారు. 9వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్ వదిలేయగా, 38వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్ క్యాచ్‌లు జారవిడిచారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..