AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS IRE: దీపక్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో పసికూనపై టీమిండియా గెలుపు.. సిరీస్‌ కైవసం..

IND VS IRE 2nd T20 Match: మొదటి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై సులభంగా విజయం సాధించిన టీమిండియాకు రెండో మ్యాచ్‌లో మాత్రం గెలుపు అంత ఈజీగా దక్కలేదు. చివరి బంతివరకు భారత జట్టుకు ముచ్చెమటలు పట్టించింది పసికూన ఐర్లాండ్‌.

IND VS IRE: దీపక్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో పసికూనపై టీమిండియా గెలుపు.. సిరీస్‌ కైవసం..
Deepak Hooda
Basha Shek
|

Updated on: Jun 29, 2022 | 1:22 AM

Share

IND VS IRE 2nd T20 Match: మొదటి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై సులభంగా విజయం సాధించిన టీమిండియాకు రెండో మ్యాచ్‌లో మాత్రం గెలుపు అంత ఈజీగా దక్కలేదు. చివరి బంతివరకు భారత జట్టుకు ముచ్చెమటలు పట్టించింది పసికూన ఐర్లాండ్‌. అయితే టీమిండియా అనుభవం ముందు నిలవలేక మరోసారి ఓటమిపాలైంది. డబ్లిన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ని 2-0 తో కైవసం చేసుకుంది. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. స్టిర్లింగ్ (40; 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), బాల్ బిర్నీ (60; 37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) దూకుడుగా ఆడి టీమిండియాకు ముచ్చెమటలు పట్టించారు. ఆతర్వాత హ్యారీ టెక్టార్‌ (39; 28 బంతుల్లో 5 ఫోర్లు), డాక్రెల్ (22; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అడైర్‌ (23; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా దూకుడుగా ఆడి తమ జట్టును గెలుపు అంచుల వరకు తీసుకెళ్లారు. అయితే చివర్లో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ పరాజయం పాలైంది. కాగా టకర్ (5)ని ఉమ్రాన్‌ మాలిక్‌ ఔట్‌ చేసి అంతర్జాతీయ టీ20ల్లో తన వికెట్ల ఖాతాని తెరిచాడు. అతనితో పాటు హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్‌ కుమార్ తలా ఓ వికెట్ తీశారు.

దంచి కొట్టిన దీపక్‌ హుడా..

ఇవి కూడా చదవండి

తొలి టీ20లాగే ఈ మ్యాచ్‌లోనూ దీపక్ హుడా దూకుడుగా ఆడాడు. కెరీర్‌లో కేవలం ఐదో టీ20 మ్యాచ్‌ను ఆడుతున్న హుడా కేవలం 57 బంతుల్లో 104 పరుగులు చేశాడు. తద్వారా జట్టు స్కోరును 225 పరుగులకు తీసుకెళ్లాడు. హుడా ఇన్నింగ్స్‌ లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ఈ సెంచరీతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా హుడా రికార్డు సృష్టించాడు. ఇషాన్‌ ఔటైన తర్వాత మూడో స్థానంలో క్రీజులోకి వచ్చిన దీపక్‌ సంజూ శాంసన్ తో కలిసి ఐర్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. సంజూ శాంసన్ కూడా 42 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. అతనికి కూడా అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. శాంసన్, హుడా రెండో వికెట్‌కు కేవలం 85 బంతుల్లోనే 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టు భారీ స్కోరుకు పునాది వేశారు. టీ20 క్రికెట్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం కావడం విశేషం. అడైర్ వేసిన 17వ ఓవర్లో శాంసన్ ఔటైనా.. హుడా 55 బంతుల్లోనే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. హుడా కంటే ముందు ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా మాత్రమే సెంచరీలు సాధించారు. హుడా వికెట్ పడే సమయానికి భారత్ స్కోరు 212 పరుగులు. అయితే ఆ తర్వాత ఓవర్లలో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యారు. చివరి రెండు ఓవర్లలో భారత్ 14 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. సూర్య కుమార్ యాదవ్ 15 పరుగుల వద్ద ఔట్ కాగా, కెప్టెన్ హార్దిక్ పాండ్య 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అద్భుత ఆటతీరుతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్‌ హుడాకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ పురస్కారాలు లభించాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..