AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rankings: టాప్ 5లోకి దూసుకొచ్చిన రో-కో జంట! టాప్ 1 ఎవరో తెలుసా? టాప్ 10లో నలుగురు మనోళ్ళేగా

ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి టాప్ 5లోకి చేరుకున్నాడు. పాకిస్థాన్‌పై సెంచరీతో మైదానంలో అదరగొట్టిన కోహ్లీ ఐదో స్థానాన్ని సాధించాడు. శుభ్‌మన్ గిల్ అగ్రస్థానాన్ని కాపాడుకోగా, రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రభావంతో పలు ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌లో పెరుగుదల సాధించారు.

ICC Rankings: టాప్ 5లోకి దూసుకొచ్చిన రో-కో జంట! టాప్ 1 ఎవరో తెలుసా? టాప్ 10లో నలుగురు మనోళ్ళేగా
Shubman Gill Rohit Sharma Virat Kohli
Narsimha
|

Updated on: Feb 26, 2025 | 5:38 PM

Share

ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ దూసుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌పై అజేయ శతకం బాదడంతో అతను టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు. 51వ వన్డే సెంచరీ తర్వాత కోహ్లీ ఐదో స్థానాన్ని ఆక్రమించాడు.

ఇదిలా ఉండగా, భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవలే బాబర్ ఆజామ్‌ను వెనక్కునెట్టి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న గిల్, తాజా ర్యాంకింగ్స్‌లో 817 పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో శ్రేయాస్ అయ్యర్ 679 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. మొత్తంగా, టాప్ 10లో నలుగురు భారత బ్యాటర్లు ఉండటం విశేషం.

వన్డే టాప్ 5 బ్యాటింగ్ ర్యాంకింగ్స్:

1. శుభ్‌మన్ గిల్ (భారత్) – 817 పాయింట్లు 2. బాబర్ ఆజామ్ (పాకిస్థాన్) – 770 పాయింట్లు 3. రోహిత్ శర్మ (భారత్) – 757 పాయింట్లు 4. హెన్రిచ్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) – 749 పాయింట్లు 5. విరాట్ కోహ్లీ (భారత్) – 743 పాయింట్లు

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మార్పులు:

బౌలింగ్ విభాగంలో శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ 680 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (658), భారత చైనా మాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ (656) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 641 పాయింట్లతో నాలుగో స్థానంలో, నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ కూడా 641 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

భారత పేసర్ మహ్మద్ సిరాజ్ రెండు స్థానాలు పడిపోయి 12వ స్థానానికి చేరగా, మహ్మద్ షమీ ఒక స్థానం మెరుగుపరుచుకుని 14వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్:

ఆల్‌రౌండర్ల విభాగంలో అఫ్గానిస్థాన్ ఆటగాడు మహ్మద్ నబీ అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో ఉన్నాడు.

కోహ్లీ ర్యాంకింగ్స్‌లో గణనీయమైన పురోగతి:

ఫిబ్రవరి 26న దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. సెంచరీతో రాణించి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్లు టాప్ 5లో ఉండడం గర్వకారణంగా మారింది.

టాప్ 10లో ఇతర ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన విల్ యంగ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకును, బెన్ డకెట్ 27 స్థానాలు ఎగబాకి 17వ స్థానాన్ని, రచిన్ రవీంద్ర 18 స్థానాలు ఎగబాకి 24వ స్థానాన్ని సాధించారు. భారత బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్ రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకును, దక్షిణాఫ్రికా ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ మూడు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకును పొందారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ మైఖేల్ బ్రేస్‌వెల్ నాలుగు వికెట్లు తీసి 26వ ర్యాంకుకు చేరుకున్నాడు. రచిన్ రవీంద్ర ఆల్ రౌండర్ విభాగంలో ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 15వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఈ మార్పులు ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు ప్రతిబింబంగా నిలిచాయి. బ్యాట్, బంతితో తమ ప్రతిభను నిరూపించుకున్న ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలను సంపాదించుకుంటున్నారు. కింగ్ కోహ్లీ మళ్లీ తన పాత రోజులను గుర్తుచేసేలా రాణిస్తున్నాడు!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..