IND vs AUS: చెదిరిన టీమిండియా ప్రపంచకప్ కల.. సెమీస్‌లో ఆసీస్ చేతిలో ఓటమి.. హర్మన్ ఒంటరి పోరాటం వృథా
మరోసారి ఆస్ట్రేలియా అడ్డుగోడను బద్దలు కొట్టడంలో టీమిండియా విఫలమైంది. గురువారం (ఫిబ్రవరి 23) జరిగిన మహిళల టీ 20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో భారత జట్టు 5 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. తద్వారా మరోసారి మేజర్ టోర్నీ నుంచి రిక్త హస్తాలతో నిష్ర్కమించింది
మూడేళ్లు గడిచినా ఫలితం మారలేదు. మరోసారి ఆస్ట్రేలియా అడ్డుగోడను బద్దలు కొట్టడంలో టీమిండియా విఫలమైంది. గురువారం (ఫిబ్రవరి 23) జరిగిన మహిళల టీ 20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో భారత జట్టు 5 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. తద్వారా మరోసారి మేజర్ టోర్నీ నుంచి రిక్త హస్తాలతో నిష్ర్కమించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బెత్ మూనీ (54) అర్ధశతకం సాధించగా.. కెప్టెన్ మెగ్ లానింగ్ (49 నాటౌట్), గార్డెనర్ (31) ఎలీసా హీలీ (25) రాణించారు. ఆతర్వాత భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే జెమీమా రోడ్రిగ్స్ (43), హర్మన్ ప్రీత్ కౌర్ (52) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే కీలక సమయంలో హర్మన్ రనౌట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా భారత్ జట్టు కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. 5 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్ ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్,గార్డనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా స్కాట్, జానసెన్ తలా వికెట్ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా 7వసారి కావడం గమనార్హం. సరిగ్గా మూడేళ్ల క్రితం 2020 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కంగారూలు ఏకపక్షంగా టీమిండియాను ఓడించారు. ఈసారి భారత అమ్మాయిలు గట్టి పోటీనిచ్చినా ఫలితం మాత్రం మారలేదు.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..