Border-Gavaskar trophy: నితీష్ పై అనుమానం వ్యక్తం చేస్తున్న గవాస్కర్! అతను సిద్ధంగా ఉన్నాడా? అంటూ..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు ముందు నితీష్ రెడ్డి ప్రతిభపై సునీల్ గవాస్కర్, సందేహం వ్యక్తం చేశారు. అయితే, నితీష్ రెడ్డి తన ప్రదర్శనతో గవాస్కర్ అనుమానాలను పటాపంచలు చేశాడు. బుమ్రా, కోహ్లీ, రాహుల్ లాంటి ఆటగాళ్లతో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో జట్టు ప్రదర్శనతో ముచ్చటపడ్డారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోయినా, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడంతో భారత జట్టు పెర్త్‌లో ఆస్ట్రేలియాపై గుర్తుంచుకోదగిన విజయాన్ని సాధించింది. అయితే గవాస్కర్ అభిప్రాయం ప్రకారం ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి నుండి వచ్చిన ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. తొలి టెస్టులో అరంగేట్రం చేసిన నితీష్ 41, 38* పరుగులు చేసి, ఒక వికెట్ కూడా తీశాడు.
తన టెస్టు అరంగేట్రాన్ని నిరూపించుకున్న నితీష్ రెడ్డి అత్యంత ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడాడని.. మొదటి ఇన్నింగ్సులోనే అవకాశాన్ని అందిపుచ్చుకుని జట్టులో టాప్ స్కోరింగ్ గా నిలిచాడు. నితీష్ బౌలింగ్ లో జట్టుకు కూడా ఉపయోగపడ్డాడని, ఫీల్డింగ్ అద్భుతంగా ఉందన్నాడు గవాస్కర్. భవిష్యత్తులో భారత జట్టుకి ఈ యువ ఆల్ రౌండర్ ఒక కీలక పిల్లర్ గా మారతాడని గవాస్కర్ స్పోర్ట్‌స్టార్‌కు తన కాలమ్‌లో రాశారు.
అయితే, మొదటి టెస్టు మొదటి రోజున గవాస్కర్ నితీష్ రెడ్డి టెస్టు క్రికెట్‌కు సిద్ధమా అని సందేహం వ్యక్తం చేశారు. “ఈ ఆస్ట్రేలియా పిచ్‌లలో పెద్ద బౌండరీలు ఉంటాయి. ఇద్దరినీ (ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా) తీసుకుని వెళ్తారని అనుకున్నాను. కానీ ఇది కొత్త మేనేజ్‌మెంట్, కొత్త ఆలోచన. వారు నితీష్ కుమార్ రెడ్డిని ఎంచుకున్నారు. ఆయన మంచి ప్రతిభావంతుడు అనేది సందేహమే లేదు. కానీ ఆయన టెస్టు క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నారా?” అని వ్యాఖ్యానించారు.
“ఇండియా ఇప్పుడు అడిలైడ్‌కు వెళ్లేటప్పుడు, పెర్త్‌లోని విజయంతో మళ్ళీ నిపుణులందరినీ తప్పుగా నిరూపించింది. ఈ విజయం ఇటీవలి కాలంలో టాప్ 10 విజయాలలో ఒకటిగా నిలుస్తుంది. జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో ముందంజలో నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్‌లను వరుసగా పరీక్షిస్తూ, వారు శ్వాస తీసుకునే అవకాశం లేకుండా చేశాడు. పిచ్ సహాయం చేసినప్పటికీ, అపరిచితమైన పిచ్‌పై భారత బ్యాటర్‌లు రాణించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది,” అని గవాస్కర్ పేర్కొన్నారు.
“యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ త్వరగా నేర్చుకునే ఆటగాడని అతని రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాట్ నేరుగా ఉండడం ద్వారా స్పష్టమైంది. కేఎల్ రాహుల్ మార్గదర్శకత్వంతో అతను స్థిరపడినప్పుడు, ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసేదేమి లేకపోయింది. తరువాత విరాట్ కోహ్లీ ఈ పునాది పై మరొక శతకం సాధించి జట్టును విజయపథంలో నిలిపాడు,” అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.