Video: ధోనిలాగే టిక్కెట్ కలెక్టర్.. కట్‌చేస్తే.. కోహ్లీ పాలిట విలన్‌లా మారాడు.. అసలు ఎవరీ సెన్సెషన్?
Himanshu Sangwan Bowls Out Virat Kohli: విరాట్ కోహ్లీ తన రంజీ ట్రోఫీ పునరాగమన మ్యాచ్‌లో ఫ్లాప్ అయ్యాడు. అతడిని ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ అవుట్ చేశాడు. కోహ్లీని బౌల్డ్ చేసి అభిమానుల హృదయాలకు గాయం చేసిన హిమాన్షు సాంగ్వాన్ ఎవరో తెలుసుకుందాం?

Himanshu Sangwan: 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీ ట్రోఫీకి పునరాగమనం చేసిన విరాట్ కోహ్లీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని బ్యాటింగ్‌ను ఆస్వాదించడానికి వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఉన్నారు. కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తుందని అంతా భావించారు. అయితే 29 ఏళ్ల బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ అభిమానుల ప్రణాళికలను చెడగొట్టాడు. ఈ క్రికెట్ లెజెండ్‌ని బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. కోహ్లీని బౌల్డ్ చేసి అభిమానుల హృదయాలకు భారీ గాయాన్ని చేశాడు. అసలు హిమాన్షు సాంగ్వాన్ ఎవరో ఓసారి చూద్దాం..
హిమాన్షు సాంగ్వాన్ ఎవరు?
హిమాన్షు సాంగ్వాన్ దేశవాళీ క్రికెట్‌లో రైల్వేస్ తరపున ఆడుతున్నాడు. 29 ఏళ్ల సాంగ్వాన్ 1995 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించాడు. టీమిండియా తరపున ఆడేందుకు ఎదురుచూస్తున్న హిమాన్షు దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 2019-20లో రైల్వేస్ తరపున రంజీ అరంగేట్రం చేశాడు. అదే సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీలో లిస్ట్ Aలో అతని అరంగేట్రం చేశాడు. ఫాస్ట్ బౌలర్ హిమాన్షు 23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో మొత్తం 77 వికెట్లు పడగొట్టాడు. 17 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో అతని పేరిట 21 వికెట్లు ఉన్నాయి. ఇవే కాకుండా దేశవాళీ టీ-20లో 5 వికెట్లు తీశాడు.
ఒకప్పుడు రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ కలెక్టర్‌గా..
Harish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli𓃵 | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb
— 𝐒𝐑𝐈𝐉𝐀𝐍 🇮🇹 (@LegendDhonii) January 31, 2025
విరాట్ కోహ్లీ వికెట్ తీసిన హిమాన్షు దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడానికి ముందు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ అరంగేట్రం ముందు కూడా ఇదే పని చేసేవాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో హిమాన్షు తొలిసారిగా పెద్ద స్థాయిలో తనదైన ముద్ర వేశాడు. ముంబైతో జరిగిన రంజీ మ్యాచ్‌లో 60 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి వార్తల్లో నిలిచాడు.
2012లో కోహ్లీ తన చివరి రంజీ మ్యాచ్..
విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో రంజీలో పాల్గొన్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 57 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..