DC vs PBKS : స్టేడియంలో సిక్సర్లతో విధ్వంసం.. పంజాబ్ కొంపముంచిన పంచ పాండవులు వీళ్లే
DC vs PBKS : ఐపీఎల్ 2026లో పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. అక్షర్, మిల్లర్, ఆశుతోష్, మాధవ్ తివారీ, ఆకిబ్ నబీలు హీరోలుగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమని భావించిన వేళ, ఢిల్లీ ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడారు.

DC vs PBKS : ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన 55వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమని భావించిన వేళ, ఢిల్లీ ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడారు. ముఖ్యంగా అనుభవజ్ఞులైన సీనియర్లు తమ బాధ్యతను నెరవేర్చగా, కొత్త కుర్రాళ్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఈ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ ఐదుగురు హీరోల గురించి తెలుసుకుందాం.
1. ఆశుతోష్ శర్మ
ఢిల్లీ గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించింది ఆశుతోష్ శర్మ. డేవిడ్ మిల్లర్ వంటి దిగ్గజం అవుట్ అయిన తర్వాత అందరూ ఢిల్లీ ఓటమి ఖాయమని అనుకున్నారు. కానీ ఆశుతోష్ తన మెరుపు బ్యాటింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 10 బంతుల్లోనే 240 స్ట్రైక్ రేట్‌తో 24 పరుగులు చేసి పంజాబ్ నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి.
2. మాధవ్ తివారీ
మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మాధవ్ తివారీ తన రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే అద్భుతం చేశాడు. మొదట బౌలింగ్‌లో పంజాబ్ కింగ్స్ కు చెందిన ఇద్దరు కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి కట్టడి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. ఆశుతోష్‌కు అండగా నిలుస్తూ 8 బంతుల్లో 18 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్సర్) చేసి ఢిల్లీ విజయంలో భాగస్వామి అయ్యాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 40 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
3. అక్షర్ పటేల్
ఢిల్లీ ఇన్నింగ్స్ మొదట్లోనే కుప్పకూలుతున్న సమయంలో కెప్టెన్ అక్షర్ పటేల్ బాధ్యతాయుతంగా ఆడాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన అక్షర్, స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 30 బంతుల్లో 56 పరుగులు చేసి జట్టును రేసులో ఉంచాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఒక కెప్టెన్‌గా తన ఫామ్‌ను నిరూపించుకుంటూ జట్టుకు బలమైన పునాది వేశాడు.
4. డేవిడ్ మిల్లర్
లక్ష్యం పెద్దదిగా ఉన్నప్పుడు మిల్లర్ తన అనుభవాన్ని అంతా రంగరించాడు. అక్షర్ పటేల్‌తో కలిసి ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 28 బంతుల్లోనే 51 పరుగులు చేసి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పాడు. మిల్లర్ వేసిన ఈ పునాది వల్లే ఆఖర్లో ఆశుతోష్, మాధవ్ ధైర్యంగా ఆడగలిగారు.
5. ఆకిబ్ నబీ డార్
బౌలింగ్‌లో వికెట్లు తీయకపోయినా, పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో ఆకిబ్ నబీ డార్ సక్సెస్ అయ్యాడు. 210 పరుగులు వచ్చిన ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక బ్యాటింగ్‌లో చివరి నిమిషంలో ఉత్కంఠ నెలకొన్న వేళ.. కేవలం 2 బంతుల్లోనే ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 10 పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
