AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPLలో బిగ్గెస్ట్‌ ఫ్రాడ్‌.. రూ.100 కోట్లు దొబ్బేసి.. ఫ్రాంచైజీలను దారుణంగా మోసం చేస్తున్న ఏకైక ఆటగాడు!

గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో 100 కోట్లకు పైగా సంపాదించినప్పటికీ, అతని ప్రదర్శన నిరాశపరిచింది. పంజాబ్ కింగ్స్, RCB వంటి జట్లు అతనిపై పెట్టుబడి పెట్టి వెనక్కి తగ్గాయి. అతని అస్థిరత, అంచనాలకు తగ్గట్టు ఆడకపోవడం వల్ల అతనికి భవిష్యత్తులో ఐపీఎల్‌లో స్థానం ఉండదని అనిపిస్తుంది.

IPLలో బిగ్గెస్ట్‌ ఫ్రాడ్‌.. రూ.100 కోట్లు దొబ్బేసి.. ఫ్రాంచైజీలను దారుణంగా మోసం చేస్తున్న ఏకైక ఆటగాడు!
Maxwell
SN Pasha
|

Updated on: Apr 19, 2025 | 4:20 PM

Share

ఐపీఎల్‌ అంటేనే ఆటగాళ్లపై కనకవర్షం కురిపించే మనీ రిచ్‌ లీగ్‌. ప్రపంచంలోని ప్రతీ క్రికెటర్‌ కూడా ఐపీఎల్‌లో ఆడాలని కలలు కంటూ ఉంటారు. ఈ మెగా లీగ్‌లో ఆడేందుకు దేశాల పౌరసత్వం మార్చుకున్న ప్లేయర్లు కూడా ఉన్నారంటూ అతిశయోక్తి కాదు. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌, ఇక్కడ వచ్చే డబ్బు అలాంటిది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్‌, రిచెస్ట్‌ టీ20 క్రికెట్‌ లీగ్‌.. ఈ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. ఇలాంటి ఓ లీగ్‌ను దాదాపు 14 ఏళ్లుగా ఓ ఆటగాడు దారుణంగా మోసం చేస్తున్నాడు. ఆ ప్లేయర్‌ మరెవరో కాదు.. ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను ఆడే ఆటను చూసి.. ఐపీఎల్‌ మెగా వేలంలో అతనిపై కోట్ల వర్షం కురిపిస్తుంటాయి ఫ్రాంచైజీలు. కానీ, తీరా గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత.. ఇతనికా అన్ని కోట్లు ఇచ్చి కొన్నది..? అని క్రికెట్‌ అభిమానులు షాక్‌ అయ్యేలా చేస్తుంటాడు. ఎప్పుడో అమాసపున్నామికి ఒక్క పెద్ద స్కోర్‌ కొడుతుంటాడు తప్పితే.. తనపై ఫ్రాంచైజ్‌ పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ సరిగ్గా నిలబెట్టుకోలేకపోయాడు.

ఐపీఎల్‌లో మ్యాక్సీ బాధితుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. పంజాబ్‌ కింగ్స్‌, ఆర్సీబీ గురించే. ఈ రెండు జట్లు అతని విషయంలో మోసపోయినట్లు మరే టీమ్ కూడా మోసపోలేదు. ఆర్సీబీ అయినా.. ఓ మూడేళ్లు చూసి అతన్ని వదిలించుకుంది. కానీ, పంజాబ్‌ మాత్రం మరోసారి అతన్ని నమ్మి మోసపోతుంది. తాగొచ్చి కొడుతున్నాడని భర్తకు విడాకులిచ్చి.. మళ్లీ కొన్నేళ్లకు కట్నం ఇచ్చి మరీ అతన్నే పెళ్లి చేసుకున్నట్లు.. వద్దని వదిలేసుకున్న మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్‌ కింగ్స్‌ 2025 సీజన్‌ కోసం జరిగిన మెగా వేలంలో 4.2 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంది. దాని ఫలితం ఏంటంటే.. ఈ సీజన్‌లో అతను ఆడిన 6 మ్యాచ్‌ల్లో చేసిన పరుగులు కేవలం 41 మాత్రమే. ఈ భీకర బ్యాటింగ్‌ చూసిన తర్వాత.. నువ్వు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో వద్దులే బాబు.. కాస్త పక్కన కూర్చో అంటూ.. ఆర్సీబీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్‌ పక్కనపెట్టింది. నిజం చెప్పాలంటే చాలా త్వరగానే వాళ్లు కళ్లు తెరిచారు. లేదంటే.. మ్యాక్సీని టీమ్‌లో కొనసాగించడం అంటూ.. కేవలం 10 మందితో బరిలోకి దిగినట్లే.

అఫ్‌కోర్స్‌.. బౌలింగ్‌లో కాస్త కాన్రిబ్యూట్‌ చేసినా.. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూపంలో మ్యాక్సీపై పంజాబ్‌ పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుంది. వాళ్ల టీమ్‌లో జెన్యూన్‌ మ్యాచ్‌ విన్నర్‌ చాహల్‌ ఫామ్‌లోకి వచ్చేశాడు. మిగతా బౌలర్లు బాగా రాణిస్తున్నారు. అయినా బౌలింగ్‌ చూసి టీమ్‌లో పెట్టుకోవడానికి మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కాదు.. క్వాలిటీ బ్యాటింగ్‌ చేస్తూ.. ఎప్పుడైనా అవసరం అనుకుంటే.. పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా ఉపయోగపడాలి. అంతేకానీ.. బ్యాటింగ్‌ చేయను బౌలింగ్‌ చేస్తా టీమ్‌లో పెట్టుకోండి అంటూ కుదరదు. 2012లో మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్‌లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తీసుకుంది. ఆ సీజన్‌లో 2 మ్యాచ్‌లు ఆడి కేవలం 6 పరుగులు చేశాడు. సరే.. కుర్రాడు, తొలి సీజన్‌, రెండే మ్యాచ్‌లు కదా ఆడించింది అనుకుంటే.. ఆ తర్వాత 2013లో ముంబై ఇండియన్స్‌ మ్యాక్స్‌వెల్‌ను 6.3 కోట్ల భారీ ధర పెట్టి తీసుకుంది. ఆ సీజన్‌లో 3 మ్యాచ్‌లు ఆడి 36 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2014 సీజన్‌ కంటే ముందు మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సొంత చేసుకుంది.

ఆ టీమ్‌ తరఫున 2014లో మ్యాక్స్‌వెల్‌ అద్భుతంగా ఆడాడు. 16 మ్యాచ్‌ల్లో 552 పరుగులు సాధించాడు. ఇదే మ్యాక్స్‌వెల్‌ 14 ఏళ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో బెస్ట్‌ సీజన్‌. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడో 2021లో ఆర్సీబీ తరఫున కాస్త బెటర్‌గా ఆడాడు. ఈ మధ్యలో అంటే 2015 నుంచి 2020 వరకు.. మ్యాక్స్‌వెల్‌ వరెస్ట్‌ బ్యాటింగ్‌ చేశాడు. మ్యాక్స్‌వెల్‌తో విసిగిపోయిన పంజాబ్‌ 2017 తర్వాత అతన్ని వదిలించుకుంది. మ్యాక్సీని ఐపీఎల్‌లోకి తీసుకొచ్చిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 2018లో మరోసారి మ్యాక్స్‌వెల్‌ను నమ్మి దారుణంగా మోసపోయింది. 2018లో 12 మ్యాచ్‌లు ఆడి కేవలం 169 పరుగులు చేశాడు. 2020లో మళ్లీ పంజాబ్‌ రూ.10.75 కోట్లు పెట్టి అతన్ని తీసుకొని రెండోసారి చేతులు కాల్చుకుంది. ఆ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 108 రన్స్‌ మాత్రమే చేశాడు. ఇక ఆర్సీబీ వంతు.. 2021 సీజన్‌ కంటే ముందు రూ.14.25 కోట్ల భారీ ధరపెట్టి మ్యాక్స్‌వెల్‌ను తీసుకుంది ఆర్సీబీ. ఆ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 513 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

కానీ, మళ్లీ షేరా మామూలే. 2024 సీజన్‌లో ఆర్సీబీ అంత పోరాటం చేసి.. ఒక శాతం అవకాశం ఉన్న చోట కూడా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయినా కూడా అందులో మ్యాక్స్‌వెల్‌ కాంట్రిబ్యూషన్‌ ఎంతో తెలుసా.. 10 మ్యాచ్‌ల్లో కేవలం 52 పరుగులు. దీంతో.. ఐపీఎల్‌ 2024 తర్వాత ఆర్సీబీ కూడా నువ్వు వద్దరా నాయనా వెళ్లిపో అంది. ఇక మరో సారి ముచ్చటగా మూడోసారి పంజాబ్‌ కింగ్స్‌ 2025 కోసం జరిగిన మెగా వేలంలో మ్యాక్స్‌వెల్‌ను నమ్మింది. కానీ, మనోడు.. ఏం మారలేదు, ఎక్కడి వెళ్లినా ఒకటే మోసం అన్నట్లు మరోసారి విఫలం అవుతున్నాడు. 2012 నుంచి ఇప్పటి వరకు మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ నుంచి ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా..? అక్షరాలే 100 కోట్ల 65 లక్షలు. ఇంత సొమ్ము తీసుకొని.. మనోడు సరిగ్గా ఆడింది కేవలం 3 సీజన్స్‌లోనే. 2014, 2021, 2023. ఈ మూడు సీజన్లు తప్పిస్తే.. మరే సీజన్‌లోనూ కనీసం 400 పరుగుల మార్క్‌ కూడా దాటలేకపోయాడు. వందకోట్లకు పైగా తీసుకొని.. ఈ రేంజ్‌లో ఫ్రాంచేజీలను ముంచిన మరో ప్లేయర్‌ లేదు.

మ్యాక్స్‌వెల్‌ను ఎక్కవగా నమ్మిన మూడు ఫ్రాంచైజీలు పంజాబ్‌, ఆర్సీబీ, ఢిల్లీ. ఒక్కటి గమనిస్తే.. ఈ మూడు టీమ్స్‌కి కూడా ఒక్క ఐపీఎల్‌ ట్రోఫీ లేదు. ముంబై ఒక్క సీజన్‌తోనే మ్యాక్సీ గురించి అర్థం చేసుకొని మళ్లీ అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే అంత సక్సెస్‌ఫుల్‌ టీమ్‌ అయింది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ఆడేటప్పుడు ప్రాణం పెట్టి ఆడే.. మ్యాక్సీ ఐపీఎల్‌ అనగానే.. ఏదో హాలిడే అకేషన్‌కు వచ్చినట్లు ఫీల్‌ అవుతాడో ఏమో కానీ.. ఎప్పుడూ పెద్ద సీరియస్‌గా తీసుకొని ఆడడు. ఆ విషయం మిగతా అన్ని టీమ్స్‌కు అర్థం అవుతున్నా.. ఒక్క పంజాబ్‌కు మాత్రం ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నట్లు ఉంది. ఇలాగే ఉంటే.. ఇక వచ్చే సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ బహుషా ఐపీఎల్‌లో కనిపించకపోవచ్చు. ఎందుకంటే.. ఆర్సీబీ, ఢిల్లీ అతన్ని మళ్లీ తీసుకోవు.. ఇప్పటి వరకు పట్టించుకోని ఏ టీమ్‌ కూడా మ్యాక్స్‌వెల్‌ కావాలని కోరుకోవు. ఇక పంజాబ్‌ మళ్లీ అతన్ని అంటిపెట్టుకుంటే.. ఇక వాళ్లను మించిన విశాల హృదయం గల వాళ్లు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని అర్థం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..