World Cup 2023: పాక్ గొంతెమ్మ కోరికలపై బీసీసీఐ ఆగ్రహం.. మరింత ఆలస్యం కానున్న వరల్డ్ కప్ షెడ్యూల్
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులే కాకుండా క్రికెట్ బోర్డులు, ఆటగాళ్లు కూడా షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ జాప్యానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కారణమని బీసీసీఐ మండిపడుతోంది.
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్‌కు మరికొన్ని నెలలే మిగిలి ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ మెగా క్రికెట్ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తోంది. ఇందుకోసం బీసీసీఐ సన్నాహాలు కూడా ప్రారంభించింది. అయితే దీనికి ముందు ప్రపంచ కప్ షెడ్యూల్ రిలీజ్ కావాల్సి ఉంది. జూన్ తొలివారంలో షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందన్నాను కానీ కుదరలేదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులే కాకుండా క్రికెట్ బోర్డులు, ఆటగాళ్లు కూడా షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ జాప్యానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కారణమని బీసీసీఐ మండిపడుతోంది. కాగా IPL 2023 ముగియగానే భారత క్రికెట్ బోర్డు ప్రపంచకప్ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రపంచకప్ షెడ్యూల్‌లో రెండు ప్రధాన మార్పులు చేయాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది. అందుకే షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవుతోందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అహ్మదాబాద్, ఇప్పుడు చెన్నై
ఆసియా కప్‌తో మొదలైన పీసీబీ, బీసీసీఐ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఇంకా కొనసాగుతోంది. వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్ అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడేందుకు పాకిస్థాన్ అభ్యంతరం తెలిపింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు చెన్నైలో ఆడేందుకు కూడా ససేమిరా అంటోంది పాకిస్తాన్. ‘పీసీబీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోంది. అయితే వరల్డ్ కప్ షెడ్యూల్ ఆలస్యానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డే కారణం. గతంలో అహ్మదాబాద్‌లో ఆడేందుకు సిద్ధంగా లేమన్న పాకిస్థాన్ ఇప్పుడు చెన్నైలో ఆడేందుకు కూడా నిరాకరిస్తోంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీసీబీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రాఫ్ట్ షెడ్యూల్‌పై అభ్యంతరం..
కాగా ప్రపంచకప్ డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఐసీసీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు పంపగా, పీసీబీ రెండు అభ్యంతరాలను లేవనెత్తింది. దీన్ని మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని అభ్యర్థించింది. ఈక్రమంలోనే షెడ్యూల్ వాయిదా పడింది. చెన్నైలో ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగే మ్యాచ్ వేదికతో పాటు ఆస్ట్రేలియాతో మ్యాచ్ బెంగళూరులో కాకుండా చెన్నైలో నిర్వహించాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది. అలాగే అఫ్గానిస్థాన్‌తో చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌ను బెంగళూరులో ఏర్పాటు చేయాలని కోరుతోంది. అయితే ఈ అభ్యర్థనను బీసీసీఐ తిరస్కరించింది. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఐసీసీపైనే ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..