ఒకే ఓవర్‌తో ఓవర్‌నైట్ స్టార్‌డమ్.. టీమిండియా తొలి టీ20 ప్రపంచకప్ హీరో.. ఆఖరి మ్యాచ్ ఆడిన 16 ఏళ్లకు రిటైర్మెంట్
ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని జోగిందర్ నిలబెట్టుకున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి మిస్బా వికెట్‌ను పడగొట్టాడు. తద్వారా టీమిండియా తొలి టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఎందుకోగానీ మైదానంలో పెద్దగా కనిపించని ఈ మీడియం పేసర్ డీఎస్పీగా స్థిరపడ్డాడు.
జోగిందర్ శర్మ.. ఒకే ఓవర్‌తో ఓవర్‌నైట్ హీరో అయిపోయిన ఈ మీడియం పేసర్ క్రికెట్ అభిమానులకు బాగా గుర్తుంటాడు. 2007 టీ ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మిస్బా ఉల్ హక్‌ను అతను ఔట్ చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ పోరులో పాక్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి టీ20 ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది ధోని సేన. చివరి ఓవర్‌లో పాక్ గెలుపునకు 13 పరుగులు అవసరం కాగా.. మిస్బా ఉల్ హక్ క్రీజులో పాతుకుపోయాడు. ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీసింగ్, హర్భజన్ సింగ్.. ఇలా ఎందరో అనుభవమున్న బౌలర్లను కాదని కెప్టెన్ ధోని బంతిని జోగిందర్ శర్మ చేతికి ఇచ్చాడు. అప్పటికీ జోగిందర్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఏమాత్రం అనుభవం లేదు. దీనికి తోడు ప్రపంచకప్ ఫైనల్. అందులోనూ దాయాది దేశం. దీంతో ధోని డెసిషన్‌తో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని జోగిందర్ నిలబెట్టుకున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి మిస్బా వికెట్‌ను పడగొట్టాడు. తద్వారా టీమిండియా తొలి టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఎందుకోగానీ మైదానంలో పెద్దగా కనిపించని ఈ మీడియం పేసర్ డీఎస్పీగా స్థిరపడ్డాడు. అలా సుమారు 16 ఏళ్ల క్రితం ఆఖరి మ్యాచ్ ఆడిన జోగిందర్ శర్మ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. సామాజిక మాధ్యమాల ద్వారా అతనే ఈ విషయాన్ని పంచుకున్నాడు.
ఆ మధుర క్షణాలను మర్చిపోలేను..
‘ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. 2002 నుంచి 2017 వరకు సాగిన నా క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఏడాదులు అద్భుతంగా గడిచాయి. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నేను సాధించిన గొప్ప గౌరవం. ఈ అవకాశం కల్పించిన బీసీసీకి కృతజ్ఞతలు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉండడం నా అదృష్టం. ఫైనల్‌లో ధోని నన్ను నమ్మి బంతిని చేతిలో పెట్టడం.. ఒత్తిడిలో బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించడం నా జీవితంలో ఎప్పటికి మరిచిపోలేను. రిటైర్మెంట్ తర్వాత ఇష్టపడ్డ క్రికెట్‌లోనే కెరీర్ కొనసాగాలనుకుంటున్నా. నా జీవితంలో కొత్త అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నా’ అని తన రిటైర్మెంట్ సందేశంలో తెలిపాడు జోగిందర్.
Announced retirement from cricket Thanks to each and everyone for your love and support ?❤️?? pic.twitter.com/A2G9JJd515
— Joginder Sharma ?? (@MJoginderSharma) February 3, 2023
ఇక జోగిందర్ శర్మ కెరీర్ విషయానికొస్తే.. భారత్ తరఫున 4 టీ20 మ్యాచ్‌లు, 4 వన్డేలు ఆడాడు. అంతకుముందు 77 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, 80 లిస్ట్ A, 63 T20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 297 వికెట్లు తీశాడు. లిస్ట్ ఎలో 115 వికెట్లు తీశాడు. అలాగే టీ20లో 61 వికెట్లు తీశాడు. దీంతోపాటు 5 ఫస్ట్ క్లాస్ సెంచరీలు కూడా బాదాడు. అలాగే ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మొత్తం 12 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జోగిందర్ శర్మ ప్రస్తుతం హర్యానా పోలీస్‌లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..