Toli Ekadasi 2021: తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని ఎందుకంటారు? .. శేషసాయిని పూజిస్తే కలిగే ఫలితాలు ఏమిటంటే?
Toli Ekadashi 2021: తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకొస్తుంది తొలి ఏకాదశి. ఈ పండగకు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత..
Toli Ekadashi 2021: తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకొస్తుంది తొలి ఏకాదశి. ఈ పండగకు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. తొలి ఏకాదశి అంటే ఏమిటి ..ఈ రోజున శేషసాయిని పూజిస్తే కలిగే ఫలితాలు ఏమిటి.. ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం.
సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశలు ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. అయితే ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాదశి” అంటారు. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి.
మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యం గురించి పురాణాలు కథనం. తొలి ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. మహాసాధ్వి సతీ సక్కుభాయి చాతుర్మాస్య వ్రతం’ ఆచరించి మోక్ష సిద్ధి పొందింది.
తొలి ఏకాదశి రైతుల పండుగ. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పైరు పచ్చగా ఉండాలని.. మంచి పంటలు పండాలని రైతులు దేవుడికి దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. ఈ నెలలో వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఇక ఈ మాసంలో అమ్మవారికి ఉత్సవాలు, బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.
ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి . ఈ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాల కథనం. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.
Also Read: Toli Ekadasi 2021: హిందువుల మొదటి పండగ.. తొలి ఏకాదశి.. ఈ రోజున పాటించాల్సిన పూజ నియమాలను తెలుసుకుందాం