వరలక్ష్మీ వ్రతం రోజున ధన లక్ష్మిగా దర్శనం ఇస్తున్న చాముండేశ్వరి.. రూ.4.5 లక్షల విలువైన కరెన్సీతో అలంకరణ.. ఎక్కడంటే
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక అంతటా వరమహాలక్ష్మి పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రీ రంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం వార్తల్లో నిలిచింది. వరలక్ష్మి పండగ సందర్భంగా అమ్మవారిని రూ.4.5 లక్షల విలువైన కరెన్సీ నోట్లను ఉపయోగించి అలంకరించారు. ఈ అలంకరణ కోసం రూ.10 నుంచి రూ.500 నోట్ల వరకూ ఉపయోగించారు. దేవత ధనలక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చింది.

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వరమహాలక్ష్మి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దేవి ఆలయాలలో ప్రత్యేక కార్యక్రమాలను , పూజలను నిర్వహించారు. మాండ్య జిల్లా శ్రీరంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారు ధన లక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. ఈ ఆలయంలోని దేవతను ప్రత్యేక ధనలక్ష్మి అలంకరణలో రూ.4.5 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. కళాకారుడు సందేశ్ కళావిడ , బృందం అలంకరణ కోసం రూ.10 నుండి రూ.500 వరకు కరెన్సీ నోట్లను ఉపయోగించారు. ఈ అలంకరణ ధనలక్ష్మి రూపంలో ఉన్న లక్ష్మిదేవికి చిహ్నమని ఆలయ పూజారులు చెప్పారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెల్లవారుజాము నుండే అమ్మవారి ఆలయంలో భక్తులు రద్దీ నెలకొంది. శ్రీరంగపట్నం కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని ఒక చారిత్రాత్మక పట్టణం.
ఈ ఆలయం దుర్గాదేవి రూపమైన చాముండేశ్వరి దేవికి అంకితం చేయబడింది. శ్రీ చాముండేశ్వరి ఆలయం చారిత్రాత్మకంగా ముఖ్యమైనది. స్కంద పురాణం వంటి పురాతన గ్రంథాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. ఈ ఆలయం మైసూర్ వడయార్ రాజవంశంతో అనుబంధంతో ప్రసిద్ధి చెందింది, మహారాజులు ఈ ఆలయాన్ని పోషించారు. రాజ గోపురంతో సహా పలు నిర్మాణాలు చేపట్టారు. అంతేకాదు ఈమె మైసూర్ రాజకుటుంబానికి సంరక్షక దేవత. ఈ ఆలయాన్ని శక్తి పీఠంగా పరిగణిస్తారు. కొన్ని సంప్రదాయాల ప్రకారం ఇది సతీదేవి వెంట్రుకలు పడిపోయిన ప్రదేశం పేర్కొన్నారు .
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








