AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశిన ఉత్తర ద్వారా దర్శనం ఎందుకు చేసుకుంటారు.. దీని ప్రత్యేకత ఏమిటంటే..?

అసురులు పెడుతున్న బాధలు భరించని దేవతలు ముందుగా బ్రహ్మ వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు. అక్కడ బ్రహ్మ దేవతలను వెంటపెట్టుకుని వైకుంఠానికి వెళ్లారు. ఆ సమయంలో ఉత్తర ద్వారం నుంచి లోపల శ్రీమన్నారాయణుని దర్శించుకుని.. తమ బాధలను విన్నవించుకున్నారట. దేవతల బాధలను విన్న మహా విష్ణువు రాక్షసుల బాధల నుంచి విముక్తి చేశాడు.   

Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశిన ఉత్తర ద్వారా దర్శనం ఎందుకు చేసుకుంటారు.. దీని ప్రత్యేకత ఏమిటంటే..?
Vaikuntha Ekadashi 2023
Surya Kala
|

Updated on: Dec 23, 2023 | 12:19 PM

Share

హిందువులకు ఏకాదశి విశిష్టమైన రోజు. మాసంలో రెండు సార్లు ఏకాదశి తిధి వస్తుంది. ఏకాదశి పర్వదినం రోజున విష్ణువు మూర్తిని పూజిస్తారు. అయితే మార్గశిర మాసం ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని అత్యంత విశిష్టమైన రోజుగా భావించి పూజిస్తారు. ఈ రోజున వైష్ణవ ఆలయాలతో పాటు చిన్న పెద్ద ఆలయాల్లో ఉత్తర ద్వారా ఆలయానికి వెళ్లి దైవాన్ని దర్శించుకుంటారు. అయితే వైకుంఠ ఏకాదశిన దేవాలయాల్లో ఉత్తర ద్వారా దర్శనం ఎందుకు చేసుకుంటారు.. దీని ప్రత్యేకత ఏమిటి? పురాణాల కథనం ఏమిటో తెలుసుకుందాం..

పురాణాల కథనం

అసురులు పెడుతున్న బాధలు భరించని దేవతలు ముందుగా బ్రహ్మ వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు. అక్కడ బ్రహ్మ దేవతలను వెంటపెట్టుకుని వైకుంఠానికి వెళ్లారు. ఆ సమయంలో ఉత్తర ద్వారం నుంచి లోపల శ్రీమన్నారాయణుని దర్శించుకుని.. తమ బాధలను విన్నవించుకున్నారట. దేవతల బాధలను విన్న మహా విష్ణువు రాక్షసుల బాధల నుంచి విముక్తి చేశాడు.

ముక్కోటి దేవతలు

ఉత్తర ద్వారం నుంచి వైకుంఠ వాసుడిని దర్శనం చేసుకున్నారు కనుక ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, గరుత్మంతుడిని అధిరోహించిన శ్రీ మహా విష్ణువు దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు దర్శనం ఇవ్వడంతో ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాదు ఈ పర్వదినాన్ని    ‘హరివాసరమ’ అని, ‘హరిదినమ’ అని, ‘వైకుంఠ దినమ’ అని కూడా అంటారు.

ఇవి కూడా చదవండి

ఈ ఏకాదశి ‘మూడు కోట్ల ఏకాదశుల’తో సమానమని పండితులు చెబుతారు. ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి ఏడాదిలోని 24 ఏకాదశుల్లో అత్యంత ఫలవంతం అని శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమని ప్రతీతి.

వైకుంఠ ఏకాదశి వ్రతం

ఈ వైకుంఠ ఏకాదశి రోజున “వైకుంఠ ఏకాదశి వ్రతం” ఆచరిస్తే విశిష్ట ఫలవంతం అని విశ్వాసం. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న తమ పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

ముర రాక్షసుడు

కృత యుగంలో ముర అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు విష్ణువుకి మొరపెట్టుకుంటారు. విష్ణుమూర్తి మురాసురుడి మీదికి దండెత్తి మురని వధించాలని చూస్తాడు. దీంతో ముర సాగర గర్భంలోకి వెళ్లి దాక్కున్నాడు. రాక్షసుడిని సముద్ర గర్భం నుంచి బయటకు రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ‘ఏకాదశి’ అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని పూజిస్తారు.

వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం

వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం నుంచి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

ఏకాదశి ఉపవాసం

వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉపవాసం ఉంది.. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిలను నియమ నిష్టలతో పూజించాలి. ఉపవాస దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. అయితే ఉపవాస దీక్ష చేయలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లను ఆహారంగా తీసుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు