Ugadi 2022: ఉగాది పచ్చడి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు.. తినే ముందు చదువుకోవాల్సిన శ్లోకం ఏమిటంటే
Ugadi 2022: తెలుగువారి కొత్త సంవత్సరం(Telugu New Year) ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి' (Ugadi Pacchadi). ఈ పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను..
Ugadi 2022: తెలుగువారి కొత్త సంవత్సరం(Telugu New Year) ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. పండగ ప్రత్యేకత ‘ఉగాది పచ్చడి’ (Ugadi Pacchadi). ఈ పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి ఇచ్చే సందేశం. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతిగా నిలుస్తాయి. ఈ పచ్చడిలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది.
మధురం: ఈ పచ్చడిలో తీపినిస్తుంది కొత్తబెల్లం.. ఇది ఆనందానికి సంకేతం.. కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. మానసిక ఉల్లాసానికి అతి ముఖ్యమైన రుచి తీపి. అంతేకాదు శరీరానికి పిండిపదార్ధాలను అందిస్తుంది బెల్లం. వాతం, పిత్తం పెరగనివ్వకుండా అదుపులో ఉంచుతుంది. కొత్తకణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. అయితే కొంతమంది తీపి తింటే బరువు పెరుగుతామంటూ పక్కన పెడుతున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం. కనుక తీపిని పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఆమ్లం: పులుపు.. ఉగాది పచ్చడిలో ఈ రుచి కోసం కొత్త చింతపండుని ఉపయోగిస్తారు. ఈ రుచి విసుగుకి సంకేతం. పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను సూచిస్తుంది. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది. అంతేకాదు పులుపు ఆహారం జీర్ణం కావడానికి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ రుచిని ఆహారంలో చేర్చుకోకపోతే జీర్ణశక్తి దెబ్బతింటుంది. అయితే పులుపుని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు.
కారం: ఉగాది పచ్చడిలో మూడో రుచి కటు.. అంటే కారం. ఈ రుచి సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుంది. ఆరోగ్య పరంగా చూస్తే , శరీరంలో వేడిని పుట్టిస్తుంది కారం. జీర్ణశక్తిని పెంచుతుంది. కారం శరీరంలోని క్రిముల్ని నాశనం చేస్తుంది. అయితే ఈ కారాన్ని కూడా తక్కువగానే తీసుకోవాలి. లేదంటే కడుపులో మంట, పిత్త సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కోపం పెరుగుతుంది.
ఉప్పు: ఉగాది పచ్చడిలో మరో ముఖ్యమైన రుచి లవణం.. ఉప్పు.. ఇది భయానికి జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలను ఉప్పు అందిస్తుంది. ఆకలి, జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే ఉప్పుని శరీరానికి తక్కువ పరిమాణంలోనే అందించాలి. అధిక మొత్తంలో ఉప్పుని తీసుకుంటే మూత్రపిండాలకు హాని కలుగుతుంది. కీళ్ల వాతం, గ్యాస్ట్రిక్.. వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
చేదు: ఉగాది పచ్చడి ఆరు రుచుల్లో అతిముఖ్యమైదని తిక్త.. చేదు. ఈ పచ్చడిలో ఈ రుచిని వేప పువ్వు ఇస్తుంది. అంతేకాదు ఈ ఉగాది పచ్చడికి వేప పువ్వే ప్రధానం. చేదు జీవితంలో కలిగే బాధలకు.. దుఃఖనికి సంకేతం. పచ్చడిలో చేదు రుచి కోసం వేప పువ్వుని ఉపయోగిస్తారు. ఈ వేప పువ్వు శరీర ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి, మలినాలను బయటికి పంపుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. అయితే చేదును ఎక్కువగా తింటే శారీరకంగా బలహీనంగా మారతాము. బాధ, దిగులు ఎక్కువవుతాయి.
వగరు: ఉగాది పచ్చడిలో ఈ రుచి పచ్చి మామిడికాయల నుండి వస్తుంది. మామిడి కాలానికి ఉగాదే మొదలు.ఈ రుచి ఆశ్చర్యానికి సంకేతం.ఈ రుచి శరీరం దృఢంగా ఉండడానికి అవసరం. గాయాలు మాని, మంట తగ్గడానికి ఈ వగరు రుచి ఉన్న పదార్థాలు తోడ్పడతాయి. అయితే అతిగా తీసుకుంటే వాత వ్యాధులు, పేగుల్లో సమస్యలు వస్తాయి. పలు మానసిక సమస్యలూ ఎక్కువవుతాయి.అందుకనే వగరు కూడా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.
ఉగాది రోజున అభ్యంగ స్నానం చేసి.. ఉగాది పచ్చడి చేసి.. పరగడుపున అల్పాహారంగా తీసుకుంటారు. ఉగాది పచ్చడి .. ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెబుతుంది. మనిషి జీవితంలో ఉండే ఎదురయే కష్ట సుఖాలను ఒకేరీతిన చూడాలని సూచిస్తుంది.
శ్లోకం: శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం
ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడిని తీసుకోవాలి