TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. కొండపై ఆ ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు
ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమల (Tirumala) కు చేరుకుంటారు. శ్రీవారిని కళ్లారా చూడాలని తాపత్రయపడుతుంటారు. అయితే కొత్తగా తిరుమల కొండకు చేరుకునే వారికి ఎటు వెళ్లాలి....
ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమల (Tirumala) కు చేరుకుంటారు. శ్రీవారిని కళ్లారా చూడాలని తాపత్రయపడుతుంటారు. అయితే కొత్తగా తిరుమల కొండకు చేరుకునే వారికి ఎటు వెళ్లాలి.. ఎలా దర్శనం చేసుకోవాలి.. వంటి సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అలాంటి వారి కోసం టీటీడీ మరో కొత్త ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమల కొండ పై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేలా సమాచారం మొత్తాన్ని సేకరించింది. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు.. కావాల్సిన చోటుకు ఎవరి సహాయం లేకుండా స్వంతంగా వెళ్లిపోవచ్చు. అతిథిగృహాలు, వసతి సముదాయాలు, క్యూకాంప్లెక్స్, లడ్డూ కౌంటర్లు, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్ వంటి విభాగాల వివరాలను తెలిపేలా స్కాన్ రూపంలో భద్రపరిచారు. అంతే కాదండోయ్.. భక్తులు తాము వెళ్లాలనుకున్న చోటుకు క్లిక్ చేస్తే మ్యాప్ కూడా కనిపించడం విశేషం. ఈ విధానాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. భక్తులు బస్టాండ్‌లో దిగిన తర్వాత ఎక్కడికి వెళ్లాలనుకున్నా స్కాన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. తిరుమల కొండపై వివిధ ప్రాంతాల్లో స్కానర్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రయోగాత్మకంగా శ్రీవారి సేవకుల ద్వారా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
మరోవైపు.. నవంబర్ నెల కోటా ప్రత్యేక ప్రవేశం దర్శనం రూ.300 టిక్కెట్లను ఈ నెల 21 న విడుదల చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 9 గంటలకు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. అక్టోబర్ నెల అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 22న ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. మరోవైపు.. ఈ నెల 27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరగనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..