Trending: వారిపై కఠిన చర్యలతో పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టండి.. టాయిలెట్ లో ఆహారం వడ్డించిన ఘటనపై కేంద్రమంత్రి సీరియస్
ఉత్తర ప్రదేశ్ లో అండర్ 17 బాలికలకు టాయిలెట్ లో నుంచి ఆహారాన్ని వడ్డించిన ఘటనపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సీరియస్ అయ్యారు. టాయిలెట్ గదుల్లో ఉంచిన ఆహారాన్ని విద్యార్థులు వడ్డించుకున్నట్లు..
ఉత్తర ప్రదేశ్ లో అండర్ 17 బాలికలకు టాయిలెట్ లో నుంచి ఆహారాన్ని వడ్డించిన ఘటనపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సీరియస్ అయ్యారు. టాయిలెట్ గదుల్లో ఉంచిన ఆహారాన్ని విద్యార్థులు వడ్డించుకున్నట్లు వీడియోలు వైరల్ కావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్, అధికారులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్ లో ఈ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. కాగా.. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అమానుష ఘటన వెలుగు చూసింది. బాలికలకు అధికారులు టాయిలెట్లలో భోజనాలు ఏర్పాటు చేశారు. సహరన్‌పుర్ జిల్లాలో ఈనెల 16న అండర్-17 బాలికల కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ టోర్నమెంట్ లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. అయితే పోటీల సమయంలో తమకు టాయిలెట్‌లో భోజనాలు ఏర్పాటు చేసినట్లు కొందరు జూనియర్ ప్లేయర్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటికొచ్చాయి.
టాయిలెట్ గదిలో వంటపాత్రలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్లు వీడియోలో ఉంది. ఈ ఘటనపై వివరణ అడగగా.. స్థలం లేనందునే ఇలా చేశామని అధికారులు చెప్పడం గమనార్హం. వారి సమాధానం విన్న నెటిజన్లు మరింత ఆగ్రహావేశాలకు లోనయ్యారు. భోజనాలను టాయిలెట్‌లో ఏర్పాటు చేయలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వంటపాత్రలను బట్టలు మార్చుకునే గదిలో పెట్టాల్సి వచ్చిందని సహరన్‌పుర్ జిల్లా క్రీడాధికారి అనిమేశ్ సక్సేనా చెప్పారు. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన ఉన్నతాధికారులు.. సహరన్‌పుర్ జిల్లా క్రీడా అధికారిని సస్పెండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..