Gangamma Jatara: మగవారు ఆడవారిలా మారే చిత్రమైన జాతర.. ఎవరీ గంగమ్మ తల్లి.. తిరుపతి వెంకన్నకు ఏమవుతుంది?
తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. ఈ పవిత్ర నగరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు తాటియాగుంట గంగమ్మ జాతర వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక పండుగలకు ప్రసిద్ధి చెందింది. ఈ జాతర గ్రామ దేవతగా భావించే గంగమ్మ తల్లికి అంకితం ఇచ్చే జానపద పండుగ. ఏడాదికోసారి ఏడు రోజుల పాటు మే నెలలో జరిగే ఈ పండుగ తిరుపతి ప్రజల సాంప్రదాయం, భక్తి, సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఇంతకీ ఎవరీ గంగమ్మ తల్లి.. తిరుపతి వెంకన్న స్వామికి ఏమవుతుంది వంటి విషయాలు తెలుసుకుందాం..

గంగమ్మ జాతర మూలాలు తిరుపతి చరిత్రలో లోతుగా ఉన్నాయి. గంగమ్మను శ్రీ వేంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు, ఆమె అవిలాల గ్రామంలో జన్మించినట్లు స్థానిక ఐతిహ్యాలు చెబుతున్నాయి. ఈ పండుగ మూలం ఒక దుష్ట శాసనకర్త అయిన పాలెగాడు (పాలెగొండలు) కథతో ముడిపడి ఉంది. పాలెగాడు స్త్రీలను వేధించడం, వారిపై అత్యాచారాలు చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడేవాడు. ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి జగన్మాత గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు.
స్త్రీ శక్తిని స్మరించుకునేలా..
గంగమ్మ పాలెగాడిని బయటకు రప్పించడానికి ఏడు రోజుల పాటు వివిధ వేషాలు ధరించి, అతనిని ఆకర్షించి, చివరి రోజున రాజు (దొర) వేషంలో అతనిని చంపినట్లు ఐతిహ్యం. ఈ వీరోచిత చర్యను స్మరించుకోవడానికి తిరుపతి ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర స్త్రీ శక్తి, న్యాయం కోసం నిలబడే సందేశాన్ని సూచిస్తుంది.
జాతర ప్రత్యేకతలు
జాతర మే నెలలో రెండవ మంగళవారం అర్ధరాత్రి చాటింపు (అధికారిక ప్రకటన)తో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో డప్పు వాయిద్యాలతో ప్రకటన చేస్తారు. ఆ సమయంలో ఊరి ప్రజలు వీధుల్లో ఉండకూడదని సాంప్రదాయం. ఆలయం వద్ద విశ్వరూప స్థంబానికి ‘వడిబాలు’ కట్టడంతో జాతరకు శ్రీకారం చుడతారు.
విచిత్ర వేషధారణ:
జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం భక్తులు ధరించే వివిధ వేషాలు. గంగమ్మ పాలెగాడును ఆకర్షించడానికి ఏడు రోజులు ఏడు వేషాలు ధరించినట్లు, భక్తులు కూడా బైరాగి, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం వంటి విచిత్ర వేషాలను ధరిస్తారు. ఈ వేషాలలో శరీరంపై సుద్ద, కుంకుమ, బొగ్గు, లేదా ఇతర రంగులు రాసుకోవడం, నీమ ఆకులు, రెల్ల కాయల దండలు ధరించడం సాధారణంగా కనిపిస్తుంటుంది.
స్త్రీ వేషధారణ (పేరంటాలు వేషం):
జాతర చివరి రోజున, పురుషులు స్త్రీల వేషాలు ధరించి ఆలయానికి వెళతారు. ఈ సంప్రదాయం గంగమ్మ స్త్రీ శక్తిని గౌరవించడానికి, ఆమె పాలెగాడుపై సాధించిన విజయాన్ని స్మరించడానికి జరుపుతుంటారు. ఈ రోజును స్త్రీల గౌరవానికి ఒక సంకేతంగా భావిస్తుంటారు. ఆధునిక కాలంలో, ఈ సంప్రదాయం పాటించే భక్తుల సంఖ్య పెరగుతూ వస్తోంది. జాతరలో మగవారు స్టైలిష్ చీరలు, విగ్స్, మేకప్ గాగుల్స్ వంటివి ధరించి ప్రత్యేక ఆకర్షణగా కనపడుతుంటారు.
చెంప తొలగింపు, విశ్వరూపం:
చివరి రోజున, ఆలయం ముందు గంగమ్మ విశ్వరూప మట్టి విగ్రహం నిర్మించబడుతుంది. ‘పెరంటాలు’ వేషంలో ఒక వ్యక్తి ఈ విగ్రహం చెంప (చెక్క) తొలగిస్తాడు, దీనిని ‘చెంప తొలగింపు’ అంటారు. ఈ మట్టిని భక్తులకు పంచుతుంటారు. ఇందులో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని భక్తులు నమ్ముతారు.




