Tirumala: వెంకన్న సేవలో మైసూర్ సంస్థానం రాజమాత.. 300 ఏళ్ల తర్వాత స్వామివారికి భూరి విరాళం అందజేత
శ్రీవారి ఆలయానికి మైసూర్ రాజులు ఎనలేని సేవలను అందించారు. శ్రీవారికి, ఆలయానికి అనేక కానుకలను అందించారు. అందుకనే నేటికీ వారి సేవలకు గుర్తుగా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున ప్రతి నెల రాత్రి 7:30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అయితే తాజాగా వెంకన్న కోసం మైసూరు సంస్థానం రాజమాత భూరి విరాళాలు అందించారు.

కలియుగంలో తిరుమల తిరుపతి క్షేత్రంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే అని నమ్మకం. అందుకనే తిరుపతి ఇలా వైకుంఠ క్షేత్రంగా భాసిల్లుతోంది. అనేకాదు స్వామివారికి రాజకీయనాయకులు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా భక్తులు భూరి విరాళాలు సమర్పిస్తారు. అయితే ఈ సంప్రదాయం నేటిది కాదు.. కొన్ని వందల ఏళ్లనుంచి కొనసాగుతోంది. తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి మైసూర్ సంస్థానం భారీ వెండి అఖండాలను సమర్పించారు. రాజమాత ప్రమోదాదేవి, మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్ శ్రీవారిని దర్శించుకున్న తనంతరం ఆలయంలో ఈ కానుకలను అందచేసారు. శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళంగా రంగనాయకుల మండపంలో మైసూరు సంస్థానం ద్వారా విరాళాన్ని అందించారు మైసూరు రాజమాత.
శ్రీవారికి కానుకగా అందించిన ఈ రెండు భారీ వెండి అఖండ దీపాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 ఏళ్ల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత ప్రమోదా దేవి సమర్పించడం విశేషం. ఒక్కో వెండి అఖండ దీపం సుమారు 50 కిలోల బరువు ఉంది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి లకు వెండి అఖండ దీపాలను అందచేశారు రాజమాత ప్రమోదాదేవి.
తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు ని మర్యాద పూర్వకంగా కలిసారు మైసూర్ సంస్థానం మహారాజు, రాజమాత. తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో బిఆర్ నాయుడు ను రాజమాత ప్రమోదాదేవి, మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్ కలిసి ముచ్చటించారు. రాజమాతను శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేసారు చైర్మన్. సమయంలో చైర్మన్ వెంట టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కూడా ఉన్నారు.
అయితే కోనేటి రాయుడిని కొన్ని వందల ఏళ్ల నుంచి మైసూరు మహారాజులు కోలుస్తూనే ఉన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై భక్తి శ్రద్దలతో స్వామి వారికీ వందల కోట్ల విలువైన రకరకాల కానుకలు అందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాడే పల్లకి, గరుడ, గజ, ముత్యపు పందిరి, సర్వభూపాల వాహనం, అశ్వ వాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం మొదలైనవి మైసూరు మహారాజులు సమర్పించినవే.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..