AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: స్వామిలో ఐక్యమైన గోప వనిత రామమ్మ.. ఆమె పేరు మీదుగా గొల్ల మండపం నిర్మాణం..

Tirupati: తిరుమల లో కొలువైన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని(Sri Venkateswara Swami) రోజూ లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామికి తమ మొక్కులు చెల్లించుకుంటారు...

Tirupati: స్వామిలో ఐక్యమైన గోప వనిత రామమ్మ.. ఆమె పేరు మీదుగా గొల్ల మండపం నిర్మాణం..
Gollamandapam At Tirumala T
Surya Kala
|

Updated on: Apr 23, 2022 | 9:18 AM

Share

Tirupati: తిరుమల లో కొలువైన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని(Sri Venkateswara Swami) రోజూ లక్షలాది మంది భక్తులు  దర్శించుకుంటారు. స్వామికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. తిరుపతి క్షేత్రం, ఆలయ నిర్మాణానికి గొప్ప చరిత్ర ఉంది. అనేక వింతలు , విశేషాల సమాహారం తిరుమల(Tirumala) తిరుపతి క్షేత్రం. అయితే చాలామంది భక్తులకు ఆలయ పరిసరాలు, నిర్మాణాలు, అక్కడి విశేషాలు తెలియవు. అయితే స్వామివారి గురించి ఆలయ నిర్మాణం విశిష్ట గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆలయంలో గొప్పదనాన్ని భక్తులకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు స్వామివారి ఆలయంలోని ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే గొల్ల మండపం గురించి.. నిర్మాణ శైలిని తెలుసుకుందాం..

శ్రీవారి దేవాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో గొల్ల మండపం ఉంటుంది. ఇది ఒక చారిత్రక నిర్మాణం. సన్నగా, ఎత్తుగా ఉండే ఈ మండపంపై ధర్మ రక్షిత రక్షితః అనే బోర్డు ఉంటుంది. అయితే ఆ మండపాన్ని ఏమని పిలుస్తారు.. అసలు ఎందుకు నిర్మించారు అనే విషయాలు చాలామంది భక్తులకు తెలియదు. ఆ మండపాన్ని గొల్ల మండపం అంటారు.

పూర్వం తిరుమలేశుడికి కొన్ని ఉత్సవాలను తిరుచానూరులో నిర్వహించేవారు. అయితే శ్రీరామానుజాచార్యుల వారు తిరుమలేశుని ఉత్సవాలు అన్ని పూర్తిగా కొండమీదనే జరగాలని భావించారు. అందుకు శ్రీవారి ఆలయం చుట్టూ వీధులను చదును చేసి.. ఆ వీధులను వెడల్పు చేయాలనీ, మండపాలు, అర్చకులకు ఇండ్లను నిర్మించడం, శ్రీవైష్ణవ మఠాల్ని కట్టించడం వంటి పనులు చేయాలని తీర్మానించారట.  ఈ పనులకు పర్యవేక్షకులుగా శ్రీరామనుజులవారు తన గురువైన తిరుమల నంబిని, శిష్యుడైన అనంతాళ్వారులను నియమించారు.

ఈ పనులు జరుగుతున్న సమయంలో కూలీలకు, శ్రీ వైష్ణవ స్వాములకు రామమ్మ అనే గొల్ల భామ మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట. మిగిలినవారికి మాత్రం అమ్మేదట. అయితే చాలామంది ఎందుకు వారికి ఉచితంగా మజ్జిగనిస్తావు అని అడిగితే.. ఎండలో స్వామి సేవ చేస్తున్నవారికి చల్ల ఇస్తే నేను చల్లగా ఉంటాను.. పుణ్ణెం వస్తుందట. స్వామిని చేరుకుంటా అని చెప్పేదట. అప్పుడు పనిచేస్తున్న కూలీలు.. ఆ గోపవనితకు తిరుమల నంబి, అనంతాళ్వారులను చూపించి వీరి నడిగితే మోక్షం ఇప్పిస్తారని చెప్పారు.

ఆ అమాయక గోపవనిత రామమ్మ వారి దగ్గరికి వెళ్లి సాములూ.. మీతో గోయిందస్వామి మాట్లాడుతారట గదా! మీరు చెపై నాకు వైకుంఠం వస్తుందట.. ఇప్పించండి సామి అని అడిగింది. వెంటనే ఆ ఇద్దరు గోపవనితను రేపు చెపుతాం తల్లీ అని చెప్పారు. ఆ రాత్రి చల్లలమ్మే గొల్లస్త్రీ కోరికను ఏడుకొండలస్వామికి విన్పించారు. ఆమెకు వైకుంఠం ఇప్పించే శక్తి మీకు లేదు. రామానుజులు మాత్రమే ఇప్పించగలరని శ్రీనివాసుడు పలికాడట.. ఆ విషయం తెల్లవారిన తర్వాత శ్రీనివాసుడు తమకు చెప్పిన విషయాన్నీ గోపవనితకు చెప్పారు.

కొన్ని రోజుల తర్వాత తిరుమలకు శ్రీరామానుజుల వారు వచ్చారు. ఆ గొల్ల స్త్రీ శ్రీరామానులవారికి సాష్టాంగనమస్కారం చేసి.. అనంతరం సాములూ! కొంచెం చల్ల తీసుకోండి.. అంటూ భయం, భయంగా అడిగింది. అయితే గొల్లభామను కొందరు వారించబోతారు. రామానుజుల వారు తల్లీ!! ఇది శ్రీనివాస ప్రసాదం అంటూ స్వయంగా చల్లను తాగుతూ నీకు ఏం కావాలమ్మా అని అడిగారు. సాములూ మీరు చీటిరాసిస్తే నాకు వైకుంఠం వస్తుందట. అది ఇప్పించండి చాలు.. అని అమాయకంగా శ్రీరామానుజల వారిని అడిగిందట. వెంటనే శ్రీరామనుజుల వారు ‘శ్రీనివాస పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక అంటూ ఒక తాటాకును ఆమె చేతిలో పెట్టారట. అంతే వెంటనే ‘పెరుగమ్మే రామమ్మ పరమపదం పొందింది. ఆమె పేరుతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎత్తైన నాలుగు స్థంబాల గొల్ల మండపాన్ని నిర్మించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Telugu Student: 15 ఏళ్ల తెలుగు విద్యార్థికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం.. ఎమ్మెల్సీగా ఎంపిక.. మంత్రి అయ్యే ఛాన్స్!