కోరమీసాల మొక్కలు.. శివసత్తుల పూనకాలు, గజ్జల్లాగులు, ఒగ్గు కథలతో దద్దరిల్లిన మల్లన్న క్షేత్రం!
సంక్రాంతి పండుగంటే రంగుల ముగ్గులు, కోడిపుంజుల పందాలే కాదు.. తెలంగాణలో జాతరలు ప్రత్యేకత.. తెలంగాణ జనాన్ని ఐనవోలు మల్లన్న జాతర సంథింగ్ స్పెషల్..! అక్కడ మల్లన్న అవహిస్తే ఎలా పూనకాలతో శివమెత్తిపోతారో తెలుసా..? గజ్జల్లాగులు.. డమరుక నాధాలు.. పట్నం ముగ్గులు, ఒగ్గు డోలి వాయిద్యాలతో దద్ధరిల్లే జానపదుల జాతర ఐనవోలు మల్లన్న జాతర విశిష్టత ఏంటి..? అక్కడ అడుగు పెట్టగానే వారు ఎందుకలా శివమెత్తిపోతారు..? నిజంగానే వారిపై మల్లన్న ఆవహిస్తాడా..? జాతర విశేషాలేంటో చూసొద్దాం రండి..!

జానపదుల జాతర… తెలంగాణ పల్లెలన్నీ పండుగ పూట ఒక్కచోటికి చేర్చే ఆధ్యాత్మిక వేడుక.. ఐనవోలు మల్లన్న జాతరకు వేలయింది.. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఐనవోలు మల్లికార్జునస్వామి క్షేత్రం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. గజ్జెల్లాగుల సవ్వడి.. డమరుక నాధాల ప్రతిద్వవి.. ఒగ్గుగోలి వాయిద్యాల మధ్య శివసత్తుల పూనకాలతో ఐనవోలు మల్లన్న క్షేత్రం దద్దరిల్లిపోతుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం పట్టే ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి సందర్బంగా జాతరతో మొదలై మూడు నెలల పాటు జరిగే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలలో కోర మీసాల మల్లన్నకు బోనాలు-పట్నం ముగ్గులతో భక్తులు మొక్కలు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ.
పరమశువుడి ప్రతిరూపమే మల్లికార్జునుడు…కాకతీయుల కాలంనాటి శైవక్షేత్రాలలో అత్యంత ప్రత్యేకత కలిగిన క్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో సంక్రాంతితో ఆరంభమై ఉగాది వరకుసాగే మల్లన్న బ్రహ్మోత్సవాలు మహా వైభవంగా జరుగుతాయి. ఐనవోలు మల్లన్నకు మొక్కలు చెల్లించే విధానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.
జన జాతరలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఓరుగల్లు జిల్లా. ఈ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జునస్వామి, కొత్తకొండ వీరభద్ర స్వామి, కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాలు.. ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పాదం మోపగానే చాలామందికి మల్లన్న ఆహావిస్తాడని నమ్మకం.
శివసత్తుల పూనకాలు.. ఒగ్గుపూజారుల సాంప్రదాయ ప్రదర్శన.. గజ్జెల్లాగుల భవిష్యవాణి, సాంప్రదాయ నృత్యాలు..గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మ సమేతంగా కొలువైన మల్లికార్జునస్వామి దర్శనానికి రాష్ట్రాలు దాటొచ్చే భక్తజనం.. ఇలా చెప్పుకుంటే పోతే ఒక్కటేమిటి.. అన్నీ విశేషాలే… భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో సుమారు పది లక్షల మంది భక్తులు మల్లన్న దర్శనానికి పోటెత్తుతారు.. సంక్రాంతి సందర్భంగా ఐనవోలు క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగి పోతుంది.. ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం..
ఐనవోలు మండల కేంద్రంలో కొలువైన ఈ దేవాలయానికి ఘనచరిత్రే ఉంది. కాకతీయుల పాలనా సమయంలో ఈ దేవాలయం నిర్మించారు. అయ్యన్న దేవుడు అనే మంత్రి ఈ ఆలయాన్ని నిర్మించాడని, అందుకు గుర్తుగానే ఈ గ్రామానికి అయ్యన్నవోలుగా నామకారణం చేసినట్లు చరిత్ర చెపుతుంది. క్రమక్రమంగా ఐనవోలుగా రూపాంతరం చెందిందని స్థానికులు చెబుతుంటారు. ఈ దేవాలయానికి నలుదిక్కులా కాకతీయ స్వాగత తోరణాలు, నృత్యమండపం, అష్టోత్తర స్తంభాలు, ఆలయ నిర్మాణ శైలి సైతం కాకతీయుల వైభవాన్ని గుర్తుచేస్తాయి. కోరిన కోర్కెలు నెరవేర్చే కోరమీసాల మల్లన్నగా ఇక్కడ మల్లికార్జునస్వామిని పూజిస్తారు.. బోనం, తలనీలాలు సమర్పిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం.
సంతానం లేనివారు కొబ్బరికాయతో ముడుపు కడుతుంటారు. ఒగ్గు పూజారులతో పట్నాలు వేయడం ఇక్కడ ఆనవాయితీ.. మల్లన్న జాతరలో ఒగ్గు పూజలకు ఓ ప్రత్యేకత ఉంటుంది.. ఒగ్గు పూజారులు డమరుకనాధాలతో మల్లన్నను స్తుతిస్తుంటారు. ఐనవోలు ప్రాంగణం అంతా శివసత్తుల పూనకాలు, డమరుక నాధాలతో దద్దరిల్లిపోతుంది.. ఈరగోలలు, గజ్జెల్లగుల భవిష్యవాణి ఒక్కడ మరో ప్రత్యేకత… బోనం ఎత్తిన వారికి ఇక్కడ కురుమ పూజారులు ఒగ్గు కళ ద్వారా భవిష్యవాణి వినిపిస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి మల్లన్నకు మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఇక్కడ పసుపు బండారే మహా ప్రసాదంగా బావిస్తారు..ఈ బ్రహ్మోత్సవాలకు కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు… మల్లన్న అంటే భక్తులకు అమితమైన నమ్మకం.
కాకతీయుల కాలంనుండే ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్తులు ఆలయ బాధ్యతలు చూసుకునే వారు..1969 సంవత్సరంలో ఆలయ నిర్వహణను స్వచ్ఛందంగా దేవాదాయ శాఖకు అప్పగించారు.. అప్పటినుండి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. ప్రతిసారి జాతరకు మార్నేని వంశీయుల ఇంట్లో నుండే ఊరేగింపుగా రథంపై దేవుణ్ణి ఆలయం వద్దకు తీసుకువస్తారు. ఒకప్పుడు ఇక్కడ పోలీస్ అధికారిగా విధులు నిర్వహించిన కేఆర్ నాగరాజు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు… జాతర నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు..ఈసారి కోరమీసాల మల్లన్న జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. వెయ్యి మంది పోలీసులు, 600 మంది ప్రభుత్వ సిబ్బందితో జాతరకు ఏర్పాట్లు చేశారు.. ధ్వజారోహణం తో స్థానిక ఎంఎల్ఏ నాగరాజు చేతుల మీదుగా జాతర ప్రారంభించారు
సంక్రాంతి పర్వదినాన నిర్వహించే ప్రభబండ్ల వేడుకను చూడటానికి జనం వేలసంఖ్యలో తరలివస్తారు.. ప్రభబండ్ల ప్రదర్శనలో ఎలాంటి రాజకీయ ప్రదర్శనకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశారు.. దేవదాయశాఖ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మల్లన్న అంటే కోరికలు తీర్చే కొంగుబంగారం.. అందుకే ఐనవోలు మల్లన్న అందరివడయ్యారు.. కొత్తకొండ వీరభద్ర స్వామి కూడా కోర మీసాలతో పాటు రాష్ట్ర గుమ్మడి మొక్కులు సమర్పిస్తారు.. సంక్రాంతి సందర్భంగా ఇక్కడ జాతర మహా వైభవంగా జరుగుతుంది..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
